కాళేశ్వరంలో అవినీతి చేసిన నాయకుల్ని విడిచిపెట్టేది లేదు : మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

కాళేశ్వరంలో అవినీతి చేసిన నాయకుల్ని విడిచిపెట్టేది లేదు : మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

యాదాద్రి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిన నాయకులను వదిలి పెట్టేది లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్​ అన్నారు.  ప్రాజెక్టు నిర్మాణంలో రూ. లక్షకోట్ల అవినీతి జరిగిందని, కేసీఆర్​ కుటుంబమే బాగుపడిందని ఆరోపించారు. భువనగిరిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా బీఆర్​ఎస్​ లీడర్లకు ఇంకా అహంకారం తగ్గలేదన్నారు. 

కేటీఆర్​ నోరు తెరిస్తే బూతులే వస్తున్నాయని తెలిపారు. అవసరమైన యూరియాను సప్లయ్​ చేస్తున్నా.. దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. దొడ్డిదారిలో ఇండస్ట్రీలకు అమ్ముకుంటున్నారని తెలిపారు. నెహ్రూ కాలం నుంచే కాంగ్రెస్​ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాశీం రిజ్వికి కేవలం ఏడేండ్ల జైలు శిక్ష పడేలా చూసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. 

చివరకు పాకిస్థాన్​కు సాగనంపారన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్​, మున్సిపల్​ మాజీ వైస్​ చైర్మన్​ మాయా దశరథ, పాశం భాస్కర్​, చందా మహేందర్​ గుప్తా, పడమటి జగన్మోహన్​ రెడ్డి ఉన్నారు.