
నిజామాబాద్: రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ వైపు చూస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ నేతలు గ్రామాల్లో తిరగలేరన్నారు. తెలంగాణ యూనివర్సిటీకి దిక్కు, దివానం లేకుండా పోయిందని మండిపడ్డారు. కరోనా వస్తే రాష్ట్రాన్ని దైవాధీనం చేసి వదిలేశారని, దేశంలో అందరికంటే ఎక్కువ జీతం తీసుకొని అస్సలు పనిచేయని సీఎం కేసీఆర్ అని విమర్శించారు.
‘మంత్రులు, ఎమ్మెల్యేలు పిలిస్తే గానీ కేసీఆర్ బయటకు రాడు. హరీశ్ రావు పెన్షన్‌లో కేంద్రం వాటా ఎంతనో నీ మరదలు కవితను అడుగు. దేశ వ్యాప్తంగా రెండున్నర కోట్ల ఇండ్లు మోడీ ప్రభుత్వం కట్టించింది. గిరిజన మహిళలను కుక్కలతో పోల్చిన కేసీఆర్ ముక్కును నల్గొండ ప్రజలు కోస్తారు. ఇంట్లో పోరుతో పిచ్చిలేసిన కేసీఆర్.. ప్రజలపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి కబ్జాల మంత్రిగా మారిపోయిండు. రోహింగ్యాలకు పాస్ పోర్టులపై హోంమంత్రి సమాధానం చెప్పాలి. బైంసా, నిజామాబాద్, బోధన్‌ల్లో పాస్ పోర్టులపై ఆరాతీయాలి’ అని అర్వింద్ డిమాండ్ చేశారు.
‘ఆరేళ్లలో సెక్రటేరియట్‌కే రాని సీఎంగా కేసీఆర్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. రాష్ట్రంలో అడ్మినిస్టేషన్ సరిగ్గా లేదు. తెలంగాణ మొత్తం అంధకారంలో ఉంది. కేసీఆర్ బర్త్ డేకి 500 కోట్లు ఖర్చు చేసి కోటి వృక్షార్చన అవసరమా? బీజేపీ ఎదుగుతుందనే భయంతో కొత్త పార్టీలను కేసీఆర్ తెరపైకి తెస్తున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం కాదు, రామరాజ్యం రావాలి. నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయం’ అని అర్వింద్ పేర్కొన్నారు.