మహబూబ్నగర్ అర్బన్, వెలుగు: 'అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. కేరళ, తమిళనాడులో సీట్లు పెంచుకొని అధికారానికి దగ్గరలో ఉన్నాం. ఈ ఎన్నికలు ముగించుకొని తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ అడుగు పెడుతున్నారు. నెక్ట్స్ ఫోకస్ తెలంగాణ అని ప్రధాని రాకతో సంకేతం ఇస్తున్నారు' అని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆ పార్టీ జిల్లా ఆఫీసులో శుక్రవారం మధ్యాహ్నం విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధానిగా మోడీ మూడో సారి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి తెలంగాణకు వస్తున్నారన్నారు. మే 10న హైదరాబాద్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారన్నారు.
అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఈ సభకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి పార్టీ లీడర్లు, కేడర్, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. వైఎస్ షర్మిల పార్టీ పెట్టిందని, ఇప్పుడా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిందన్నారు. కల్వకుంట్ల కవిత కూడా తన తండ్రి పేరు చెప్పుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. కవిత కూడా తన పార్టీని ఏదో ఒక పార్టీలో విలీనం చేస్తుందన్నారు. భవిష్యత్ ఎన్నికల్లో, రాజకీయాల్లో ఆమె ఉనికి ఉండదని ఎంపీ అన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుకాలు జి. పద్మజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
