విద్యతో పాటు రాజకీయాల్లో ఎదగాలి..యువతకు ఎంపీ వంశీకృష్ణ పిలుపు

విద్యతో పాటు రాజకీయాల్లో ఎదగాలి..యువతకు ఎంపీ వంశీకృష్ణ పిలుపు
  • ఈ సారి చాలా మంది యంగ్ ఎంపీలు గెలిచారు
  • పార్లమెంట్​లో చేసే చట్టాలు అందరినీ ప్రభావితం చేస్తాయని వెల్లడి
  • ‘యంగ్ ఇండియన్స్ పార్లమెంట్ 2.0’ ప్రోగ్రామ్​కు హాజరు

 హైదరాబాద్, వెలుగు: విద్యతో పాటు రాజకీయాల్లో యువత మరింత ఎదగాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమని, ఇది చదువు ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు. రాజకీయ కుటుంబ నేపథ్యం కారణంగా చిన్న వయస్సులోనే పార్లమెంట్​కు వెళ్లే అవకాశం తనకు దక్కిందన్నారు. హైదరాబాద్ యూసుఫ్​గూడలోని ఎంఎస్ఎంఈ క్యాంప్​లో సోమవారం నిర్వహించిన ‘యంగ్ ఇండియన్స్ పార్లమెంట్ 2.0’ కార్యక్రమానికి వంశీకృష్ణ చీఫ్ గెస్ట్​గా హాజరయ్యారు. 

రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో దేశ భవిష్యత్తు, నాయకత్వ లక్షణాలు వంటి అంశాలపై  వివిధ రంగాల ప్రముఖులు, వ్యాపారవేత్తలు, నిపుణులు, మేధావులు చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ప్రతి ఒక్కరికీ విద్య చాలా ముఖ్యం. చిన్నప్పటి నుంచి మంచి విద్య లభించడం నా అదృష్టం. విదేశాల్లో చదువుకుని సమాజానికి ఎలా సేవ చేయాలో ఆలోచించేవాణ్ని. దేశానికి ఏదో ఒకటి ఇవ్వాలన్న ఆలోచన నాలో ఉండేది.

 అత్యాధునిక టెక్నాలజీతో కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తున్నాం. అందులో భాగంగానే ఆటమ్ బైక్​ను మార్కెట్​కు పరిచయం చేశాం. ఈ బైక్ సక్సెస్ అయింది. సోలార్ పవర్​ను ఉత్పత్తి చేసే ప్యానెల్స్​కు అమెరికాలో పేటెంట్ లభించింది. ఎలాన్ మస్క్​తో పోటీపడి పేటెంట్లు పొందాం. ఇదే స్ఫూర్తితో ఎలక్ట్రిక్ బైక్ స్టార్టప్ ప్రారంభించాం. దీనికి కూడా దాదాపు 8 పేటెంట్లు పొందాం’’అని వంశీకృష్ణ తెలిపారు.

గత ఎన్నికలతో పోలిస్తే 30% యువత పెరిగారు

ఎంపీగా రెండేండ్లలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని వంశీకృష్ణ తెలిపారు. ‘‘ఈసారి ఎంతో మంది యువ నేతలు పార్లమెంట్​కు ఎన్నికయ్యారు. గత ఎన్నికలతో పోలిస్తే 30 శాతం యువత పెరిగారు. ఇది మంది పరిణామం. చర్చల సమయంలో సీనియర్ పార్లమెంటేరియన్లు, మేధావుల స్పీచ్​ల నుంచి ఎంతో నేర్చుకున్నా. దేశం ఎలా పనిచేస్తుంది? చట్టాలు ఎలా రూపొందుతాయి? అవి సామాన్య ప్రజల రోజువారీ జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి? అనేవి పార్లమెంట్‌‌లో నా రెండేండ్ల అనుభవం ద్వారా తెలుసుకున్నాను.

 దేశంలోని యువతకు పార్లమెంట్ ఎలా పనిచేస్తుందో తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఒక మంచి ప్రయత్నం. పార్లమెంట్ ఆమోదించే చట్టాలు మనందరినీ ప్రభావితం చేస్తాయి. నా ఐదున్నరేండ్ల కొడుకుపైనా ఆ నిర్ణయాలు ప్రభావం చూపుతాయి. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని నేను భావించేవాడిని. కానీ.. ప్రజలు తమ తరఫున చట్టాలు చేస్తారని, అవి మనల్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తాయని ఇప్పుడు అర్థమైంది. 

వీటిని అర్థం చేసుకోకపోతే అజ్ఞానంలో జీవిస్తాం. అందుకే నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో విద్యావంతులు ఉండడం చాలా ముఖ్యం.జీరో అవర్, అడ్జర్న్​మెంట్ మోషన్ వంటి విషయాలు నేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’అని వంశీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు స్టూడెంట్లు అడిగిన ప్రశ్నలకు ఎంపీ వంశీకృష్ణ సమాధానాలు ఇచ్చారు. ఓ స్టూడెంట్ మాట్లాడుతూ.. ‘‘ఆర్థిక సమస్యల కారణంగా పేద యువత రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు. దీనికి పరిష్కారం కనుగొనాలని ఎంపీగా కేంద్ర ప్రభుత్వాన్ని మీరు కోరండి. చిన్న పిల్లలు బడికి వెళ్లకుండా రోడ్లు, టోల్​ప్లాజాల వద్ద భిక్షాటన చేస్తున్నారు. 

ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి’’అని స్టూడెంట్ కోరారు. దీనికి ఎంపీ వంశీకృష్ణ స్పందిస్తూ.. ‘‘ఢిల్లీలో సిగ్నల్స్ వద్ద చాలా మంది పిల్లలు భిక్షాటన చేయడం చూస్తుంటాను. వారి సమస్యల గురించి పార్లమెంట్​లో ప్రస్తావించాను. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ యువ జనాభా మన దేశంలోనే ఉంది. నిరుద్యోగుల సంఖ్య కూడా చాలా ఎక్కువే ఉంటుంది. మా కుటుంబం అంబేద్కర్ ఇన్​స్టిట్యూషన్స్​ ద్వారా ఆర్థిక స్థోమత లేని పిల్లలకు ఫ్రీగా చదువు నేర్పిస్తున్నది. ప్రతి ఏటా 6వేల మంది స్టూడెంట్లు మా ఇన్​స్టిట్యూషన్స్​లో చదువుతున్నారు’’అని వంశీకృష్ణ తెలిపారు.