డిప్యూటీ స్పీకర్ పదవి ఇండియా కూటమికి ఇవ్వాలి.. గడ్డం వంశీ కృష్ణ

డిప్యూటీ స్పీకర్ పదవి ఇండియా కూటమికి ఇవ్వాలి.. గడ్డం వంశీ కృష్ణ

 ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందిన గడ్డం వంశీ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో ప్రజల గొంతుకనవుతానని అన్నారు. దేశ ప్రజలు అహంకార బీజేపీకి ఎన్నికల్లో పూర్తి మెజారిటీ ఇవ్వలేదన్నారు. 400సీట్లు అంటూ విర్రవీగిన బీజేపీకి 240 సీట్లు ఇచ్చి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారని అన్నారు. స్పీకర్ ఎన్నికకు విపక్షాలతో ఎలాంటి చర్చ జరపక పోవడం సరికాదని, గత సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షమైన ఇండియా కూటమికి ఇవ్వాలని డిమాండ్ చేశారు వంశీ.

ఇప్పుడన్నది బీజేపీ ప్రభుత్వం కాదని, ఎన్ డీఏ సర్కారు అని ఆయన గుర్తు చేశారు.. ప్రజలు పది ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం రక్షణ కోసం ఇచ్చిన తీర్పుతో పాలన విభిన్నంగా ఉంటుందని, తాను చాలా ఆసక్తిగా ఉన్నానని అన్నారు. పెద్దపల్లి ప్రజలు గతంలో కాకా వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామిల ను ఎంపీగా గెలిపించారని, ఇప్పుడు తనను గెలిపించారని అన్నారు. తెలంగాణ, పెద్దపల్లి ప్రజలకు ఎంపీగా సేవ చేస్తానని, ఉద్యోగ అవకాశాలు కల్పించటమే తన లక్ష్యమని అన్నారు.