ఎరువుల్లో కోటా తగ్గించడం అన్యాయం..యూరియాపై కేంద్రంతో చర్చిస్తా : ఎంపీ వంశీకృష్ణ

ఎరువుల్లో కోటా తగ్గించడం అన్యాయం..యూరియాపై కేంద్రంతో చర్చిస్తా : ఎంపీ వంశీకృష్ణ
  • ఆర్​ఎఫ్​సీఎల్​ను పూర్తి సామర్థ్యంతో నడిపేలా చూస్తానని వెల్లడి
  • కార్మికుల సమస్యలు, భద్రతా అంశాలపై అధికారులతో చర్చిస్తానని హామీ

పెద్దపల్లి, గోదావరిఖని, వెలుగు: రామగుండం ఎరువుల్లో తెలంగాణ కోటాను 60 శాతం నుంచి 30 శాతానికి తగ్గించడం అన్యాయమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎరువుల్లో రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. యూరియా సరఫరా గురించి కేంద్రంతో చర్చిస్తానని, ఎరువుల కొరత రాకుండా అన్ని స్థాయిల్లో సమన్వయం చేస్తానని చెప్పారు. ఆర్​ఎఫ్​సీఎల్​ను పూర్తి సామర్థ్యంతో నడిపేలా చూస్తానన్నారు. సోమవారం ఆయన పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు.

 గోదావరిఖని ఆర్​ఎఫ్​సీఎల్​ను సందర్శించి ఎరువుల ఉత్పత్తి, లభ్యతపై జనరల్​ మేనేజర్, అధికారులతో మాట్లాడారు. ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం, రోజు వారీ ఉత్పత్తి, యూరియా సరఫరా లింకేజ్ విధానం, రాష్ట్రానికి పంపిణీ అవుతున్న ఎరువులు, రైతులకు డైరెక్ట్ డెలివరీ తదితర అంశాలపై చర్చించారు. అవసరమైతే మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌డ్ ఫెర్టిలైజర్స్ ఉత్పత్తి పై దృష్టి పెట్టాలని సూచించారు. ఆర్​ఎఫ్​సీఎల్​ రీఓపెన్​చేయించేందుకు పెద్దపల్లి మాజీ ఎంపీ, కార్మిక మంత్రి గడ్డం వివేక్​ వెంకటస్వామి కృషిని ఆయన గుర్తు చేశారు. సంస్థను ప్రారంభించేందుకుగాను రూ.10 వేల కోట్ల రుణాన్ని మాఫీ చేసేలా కేంద్రాన్ని ఒప్పించారన్నారు. 

ఈ ప్రాంతానికి చెందిన వేలాదిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఆర్​ఎఫ్​సీఎల్​ను పునరుద్ధరించడానికి వివేక్​వెంకటస్వామి చూపిన చొరవ చాలా గొప్పదన్నారు. కార్మికుల సమస్యలు, వేతనాలు, భద్రత అంశాలపై అధికారులతో చర్చిస్తానని తెలిపారు. అంతకు ముందు పెద్దపల్లిలో అనారోగ్యానికి గురైన కాంగ్రెస్​ కార్యకర్త గంగుల సంతోష్​ను, లారీ ప్రమాదానికి గురైన మంథని మండలం అడవిసోమన్​పల్లికి చెందిన సాగే శ్రీనివాస్​ను ఎంపీ పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో కుమారస్వామి, పి.మల్లికార్జున్, సజ్జద్, విజయ్, జీన్స్, తిరుపతి, గోవర్ధన్ రెడ్డి, తిప్పారపు మధు, నర్సింగ్ దొర, నరేందర్ రెడ్డి, గడ్డం మధు, దీపక్, శ్రీను, మల్లేష్ యాదవ్, కొలిపాక శ్రీనివాస్, నర్సయ్య, చిరంజీవి, సునీల్ తదితరు పాల్గొన్నారు. 

ఆర్​వోబీ ఏర్పాటుకు కృషి 

రామగుండం మండలం కుందనపల్లి రైల్వే గేట్​దగ్గర రైల్వే ఓవర్​బ్రిడ్జి (ఆర్​వోబీ) నిర్మాణానికి కృషి చేస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. సోమవారం కుందనపల్లి మీదుగా వెళ్తున్న ఎంపీ.. గేట్ వద్ద కొద్దిసేపు ఆగారు. తరచూ గేటు వేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఎంపీ దృష్టికి తేగా.. ఆర్​ఓబీ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. రైల్వే శాఖతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.