
సీఎం కేసీఆర్ నిజాం, మొగలాయిల తరహా పాలన చేస్తున్నారని బీజేపీ పార్లమెంటరీ బోర్డు, పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యుడు ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో అవినీతి పాలన నడుస్తోందని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబ పాలనకు, కేసీఆర్ అవినీతి పాలనకు చరమగీతం పాడాలన్నారు. బీజేపీతో కలిసి తెలంగాణ వాదులు, మేధావులు, యువత, ప్రజలు టీఆర్ఎస్ పై పోరాటం సాగించాలని కోరారు. సర్థార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా నందనం కృపాకర్ రాసిన మరో ఛత్రపతి మన తెలుగు దళపతి పుస్తకాన్ని ఎంపీ లక్ష్మణ్ ఆవిష్కరించారు. గౌడన్నలకు సర్థార్ సర్వాయి పాపన్న 372వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ ఎంతో మందికి స్పూర్తి..
మహ్మదీయుల ఆగడాలు, అకృత్యాలపై పోరాడిన వీరుడు సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మొగలాయిలు, నిజాం రజాకార్ల అరాచకాలను ఎదరించారని గుర్తు చేశారు. 13 మాసాలు ఇక్కడి ప్రాంత ప్రజలు కుల వృత్తుల అస్త్రాలనే ఆయుధాలుగా మల్చుకుని నిజాం, రజాకాలర్ల మీద పోరాటం చేశారని చెప్పారు. తెలంగాణ గడ్డమీద స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ , చాకలి ఐలమ్మ , దొడ్డికొమురయ్య వంటి వారి పోరాట ఫలితమని చెప్పారు. సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ స్పూర్తితో టీఆర్ఎస్ ప్రభుత్వంపై తిరగబడాలని ఎంపీ లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
మునుగోడు ఉప ఎన్నిక నాంది పలకాలి..
ప్రధాని మోడీ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుకల్లో ప్రజలు పాల్గొన్నారని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాల గురించి ప్రధాని మోడీ ఎర్రకోట వేదికగా వివరించారని..మోడీ పిలుపునందుకుని కేసీఆర్ నియంత పాలనపై యుద్దం చేయాలని తెలంగాణ ప్రజలను కోరారు. ఉద్యమకారులు, యువత కలిసి రాష్ట్రంలో మరో పోరాటానికి సిద్ధం కావాలన్నారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలో మరో పోరాటానికి నాంది పలకాలన్నారు.