కాశీబుగ్గ, వెలుగు : వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు పనులు స్పీడప్ చేయాలని వరంగల్పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద దేవితో ఎంపీ సమావేశమయ్యారు. కేంద్రం నుంచి మంజూరైన పలు స్కీములు, ప్రజాప్రయోజన పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
.మెగా టెక్స్ టైల్ పార్క్‌కు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన పీఎం మిత్ర నిధుల వినియోగం, ప్రాజెక్ట్ ముందడుగు అంశాలపై ఎంపీ వివరాలు కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరంగల్ జిల్లా అభివృద్ధి పనుల్లో వేగం పెంచడానికి కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. మామునూరు ఎయిర్ పోర్టు విస్తరణకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. కాకతీయుల చారిత్రక వారసత్వ సంపద రక్షణ, అభివృద్ధితోపాటు జిల్లా పురావస్తు పరిశోధన -ప్రదర్శనశాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా నిధులు కేటాయించేలా ప్రయత్నం చేస్తానని తెలిపారు. వరంగల్‌ను జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని వివరించారు.
