భువనగిరిలో స్టేడియం కట్టాలె

భువనగిరిలో స్టేడియం కట్టాలె

కేంద్ర మంత్రి రిజిజుకు ఎంపీ కోమటి రెడ్డి వినతి 
న్యూఢిల్లీ, వెలుగు: భువనగిరిలో మల్టీ పర్పస్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మించాలని కేంద్రానికి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర స్పోర్ట్స్ మినిస్టర్ కిరణ్ రిజిజును కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. జాతీయ క్రీడా అభివృద్ధి నిధి నుంచి ఈ స్టేడియం నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. స్పోర్ట్స్ లో భువనగిరి అభివృద్ధి చెందేందుకు గొప్ప అవకాశం ఉందన్నారు. అన్ని రకాల ఆటల అభివృద్ధిని ప్రోత్సహిస్తే దేశ ఒలంపిక్స్ ఆశయాలకు భువనగిరి తోడ్పాటునందిస్తుందని తెలిపారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన మొత్తంలో నిధులు కేటాయించనందున యువతకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు. భువనగిరిలో మల్టీ పర్పస్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మిస్తే రానున్న తరాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తెచ్చే అవకాశం ఉందన్నారు. భువనగిరిలో 700 ఫీట్ల రాతి కొండ రాక్ క్లైంబింగ్ ట్రెయినింగ్ కు కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. లోకల్ గా వాటర్ స్పోర్ట్స్ కు అవకాశాలు ఉన్నాయన్నారు.