ఫార్మాసిటీతో హైదరాబాద్‌కి నష్టం, అనుమతులు ఆపేయాలి

ఫార్మాసిటీతో హైదరాబాద్‌కి నష్టం, అనుమతులు ఆపేయాలి

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్న ఫార్మా సిటీకి పర్యావరణ అనుమతులు ఆపివేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంగళవారం ఢిల్లీలో ప్రధానితో భేటీ ఆయిన కోమటిరెడ్డి.. నాలుగు అంశాలపై ప్రధానికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు.

మొదట 3 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తామన్న ఫార్మా సిటీని 19333 ఎకరాలకు పెంచారని, ఆ ఫార్మా సిటీ వల్ల  హైదరాబాద్ పై తీవ్ర కాలుష్య ప్రభావం ఉంటుందని తెలిపారు ఎంపీ.  హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొత్త గూడెం వరకు జాతీయ రహదారి చేయాలని కోరారు. మూసీనది శుద్ధి కోసం 3వేల కోట్లు కేటాయించాలని, సివరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు.

ఇదే విషయాన్ని ప్రధానితో భేటి అనంతరం ఎంపీ మీడియాకి తెలిపారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద భువనగిరి పార్లమెంట్ పరిధిలో బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని, హౌసింగ్ పథకాన్ని కేంద్రమే చేపట్టాలని ప్రధానిని కోరినట్టు ఎంపీ అన్నారు. తన విజ్ఞప్తులకు ప్రధాని సానుకూలంగా స్పందించారన్నారు.