రాహుల్ పై అనర్హత వేటు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిరసన

రాహుల్ పై అనర్హత వేటు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిరసన

ప్రధాని మోడీ తీసుకున్న రాహుల్ గాంధీ అనర్హత వేటు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని..న్యాయం కోసం పోరాటం చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయటాన్ని నిరసిస్తూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశమని వ్యాఖ్యానించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. భారత్ జోడో యాత్రలో కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొన్నారని చెప్పారు. ఈ యాత్రలో రాహుల్ గాంధీ 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని వెంకట్ రెడ్డి తెలిపారు. 

పాదయాత్రలో రాహుల్ గాంధీ ఎక్కడ రాజకీయాల గురించి మాట్లాడలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఉత్తరాదిలో ఉన్న మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా టీ షర్టు వేసుకుని పాదయాత్ర చేశారన్నారు. ఎన్నికల సమయంలో రాహుల్ ఒక మాట అంటే దాని మీద కోర్టు తీర్పు ఇచ్చిందని. నెలరోజుల సమయం ఇచ్చి.. వెంటనే స్పీకర్ అనర్హత వేటు వేయటం సరికాదన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించు కోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం కోసం మోడీ ఈ చర్య తీసుకున్నారని విమర్శించారు వెంకట్ రెడ్డి. గతంలో తనను కూడా డిస్క్ క్వాలిఫై చేశారని గుర్తు చేశారు. గాంధీ కుటుంబానికి పదవుల లెక్క కాదని.. ప్రధానమంత్రి అవకాశం వచ్చినా సోనియా గాంధీ ఒక ఆర్థిక వేత్తను ప్రధానిగా చేశారన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా పేదలు అన్నం తింటున్నారంటే సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ లాంటి నాయకులు చలవే అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొనియాడారు.