
హైదరాబాద్, వెలుగు : అమ్మలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అమ్మకానికి పెట్టారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. అటు కాంగ్రెస్ కూడా దేశాన్ని అమ్ముకోవాలని చూసిందని మండిపడ్డారు. బుధవారం సోమాజిగూడలోని మీడియా సెంటర్లో ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో కొల్లాపూర్ బీసీ లీడర్ సింగోట రామన్న బీజేపీలో చేరారు. రామన్నకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ప్రజలు ఎవరూ బాగుపడలేదన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం వేల కోట్లు దోచుకున్నదని ఆరోపించారు. ఒక కుటుంబం కోసం పని చేసే పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. కాంగ్రెస్ కూడా ఒక కుటుంబం కోసం పని చేసే పార్టీ అని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పీఠాలు, గడీల పాలన బద్ధలు కొట్టేందుకు బీసీలు ఏకం అవుతున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ వంచించారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ను ఎవరు నమ్మినా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే అని అన్నారు. ప్రధాని మోదీ పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అన్నారు.