రేవంత్​రెడ్డివి పిట్టల దొర మాటలు : ఎంపీ లక్ష్మణ్​

రేవంత్​రెడ్డివి పిట్టల దొర మాటలు : ఎంపీ లక్ష్మణ్​

రుణమాఫీ కేసీఆర్ వల్లే కాలే.. రేవంత్ చేస్తడా?

కీసర, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం నీటి బుడగ వంటిదని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. కేసీఆర్​ను ఓడించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్​కు అధికార భిక్ష పెడితే, సీఎం రేవంత్​కు కళ్లు నెత్తికెక్కాయని మండిపడ్డారు. తురుంఖాన్​ కేసీఆరే రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేయలేకపోయాడని, పిట్టల దొర లెక్క మాట్లాడే రేవంత్ రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తాడా అని ప్రశ్నించారు.

ఒకవేళ చేస్తే ఎప్పటిలోగా చేస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్​ చేశారు. మంగళవారం కీసర మండలం కరీంగూడలో ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. మహిళలకు  రూ.2,500 ఎప్పటిలోగా ఇస్తారో నిలదీయాలన్నారు. ప్రశ్నించే గొంతుక పేరుతో ఓట్లు వేయించుకున్న రేవంత్ ఒక్కసారైనా మల్కాజిగిరికి వచ్చాడా? ఒక్క రూపాయి అయినా ఇచ్చాడా? అని ప్రశ్నించారు.

దమ్ముంటే మల్కాజిగిరి కాంగ్రెస్​అభ్యర్థిని ప్రకటించాలని సవాల్ విసిరారు. సరైన అభ్యర్థి దొరకక డబ్బున్న వారిని వెతుకుతున్నారని విమర్శించారు. బ్రోకర్​మాటలకు, రూ.200 కోట్ల డబ్బుకు ఓట్లు పడవని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు డబ్బు సంచులకు, ధర్మానికి మధ్య జరుగుతున్నాయన్నారు. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, నాయకులు సుదర్శన్, రాంచందర్ రావు, రైతులు పాల్గొన్నారు.