- సీట్ల వివరాలు
- ఎస్టీ గురుకుల 83 స్కూళ్లు, 6,640 సీట్లు
- బీసీ గురుకుల 294 స్కూళ్లు, 28,680 సీట్లు
- ఎస్సీ గురుకుల 235 స్కూళ్లు, 18,700 సీట్లు
- వచ్చే నెల 21 వరకు ఆన్ లైన్లో అప్లికేషన్ల స్వీకరణ
- ఫిబ్రవరి లో అన్ని గురుకులాలకు కలిపి ఒకే ఎంట్రెన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 5వ తరగతి, 6 నుంచి 9వ తరగతి వరకు బ్యాక్ లాగ్ సీట్లలో అడ్మిషన్ కోసం అన్ని గురుకులాలకు కలిపి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించి ఈ సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ నెల 12 నుంచి వచ్చే నెల 21 వరకు రూ. 100 చెల్లించి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 22 వరకు ఎంపిక చేసిన జిల్లా కేంద్రాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పారు. ఒక ఫోన్ నంబర్ తో ఒక అప్లికేషన్ ను మాత్రమే అంగీకరిస్తామని పేర్కొన్నారు. అప్లికేషన్ సమయంలో అభ్యర్థి ఫోటో బదులు మరొకరి పోటో పెట్టి అప్ లోడ్ చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని కన్వీనర్ హెచ్చరించారు. అడ్మిషన్ల ఎంపికలో ఉమ్మడి జిల్లాను పరిగణనలోకి తీసుకుంటామని కృష్ణ ఆదిత్య వెల్లడించారు.
50వేలకుపైగా సీట్లు
బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతిలో అడ్మిషన్ కోసం మొత్తం సుమారు 55 వేల సీట్లు ఉన్నాయి. గత ఏడాది 1.60 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. గురుకులాల్లో సీట్లకు భారీ డిమాండ్ ఉంది. ప్రతి ఏటా అప్లై చేస్తున్న స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతున్నది. ఉచిత విద్య, వసతి, బుక్స్ తో పాటు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు చెల్లిస్తుండటం, రిజల్ట్స్ కూడా 90 శాతానికిపైగా నమోదు అవుతున్నది. వీటితో పాటు ఎంసెట్, క్యాట్, ఐసెట్, ఐఐటీ జేఈఈ వంటి పోటీ పరీక్షలకు సైతం గురుకులాల్లో ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా ట్రైనింగ్ ఇస్తుండటంతో ఆదరణ మరింత పెరుగుతున్నది.
