ఉమ్మడి మహబూబునగర్ జిల్లాలో యాసంగి సాగుకు యాక్షన్ ప్లాన్ రెడీ

ఉమ్మడి  మహబూబునగర్ జిల్లాలో యాసంగి సాగుకు యాక్షన్ ప్లాన్ రెడీ
  • కల్వకుర్తి కింద 2.80 లక్షల ఎకరాలకు సాగునీరు
  • 29 టీఎంసీలు అవసరమని అంచనా

నాగర్​కర్నూల్, వెలుగు : యాసంగి సాగుకు ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు ఇరిగేషన్​ శాఖ యాక్షన్​ ప్లాన్​ సిద్ధం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులతో పాటు నాగర్ కర్నూల్​ జిల్లాలోని కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్​ కింద ఈ యాసంగి సీజన్​లో కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్​కర్నూల్, అచ్చంపేట, వనపర్తి, జడ్చర్ల నియోజకవర్గాల్లోని 3.67 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇవ్వాల్సి ఉంది. ఇందులో 2.81 లక్షల ఎకరాలకు సాగు నీటిని ఇచ్చేందుకు ఇరిగేషన్​ ఆఫీసర్లు ప్లాన్​ రెడీ చేశారు. 

నాగర్​ కర్నూల్​ జిల్లాతో పాటు జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్​ మండలంతో కలుపుకొని 2,39,557 ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో 1,72,578 ఎకరాల్లో ఆరుతడి పంటలు, 70 వేల ఎకరాల్లో వరి, వేరుశనగ, మొక్కజొన్న పంటలకు సాగు నీటిని అందించనున్నారు. వనపర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 42,197 ఎకరాలకు సాగు నీరివ్వాలని నిర్ణయించారు. ఆరు నియోజకవర్గాల పరిధిలో 2.81లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు దాదాపు 29 టీఎంసీలు అవసరం అవుతుందని అంచనా వేశారు.

డి82తో రైతాంగానికి ప్రయోజనం..

కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రారంభంలో కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని ఆమనగల్లు, మాడ్గుల మండలాలకు సాగునీరిచ్చేలా డీపీఆర్​ రూపొందించారు.20 ఏండ్లుగా కొనసాగుతున్న కేఎల్ఐ కాల్వల నిర్మాణం ఈఏడాది కొలిక్కి వచ్చింది. కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లె వరకు నిర్మించిన డి82 కెనాల్​ను డీపీఆర్​ ప్రకారం 59 కిలోమీటర్లు పొడిగించారు.ఈ ఏడాది అక్టోబర్​లో మాడ్గుల మండలం దొడ్లపాడు వరకు పూర్తి చేశారు. వెల్దండ మండలంలో 20 వేల ఎకరాలు, ఆమనగల్లు మండలంలో 2 వేల ఎకరాలు, మాడ్గుల మండలంలో 12 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు లైన్​ క్లియర్​ అయింది. 

మెయిన్​ కెనాల్, అక్విడక్ట్, పలు స్ట్రక్చర్లు పూర్తి చేయడంతో దసరా పండగ ముందు కృష్ణా జలాలు మాడ్గుల మండలం నాగిళ్ల, దొడ్లపాడు వరకు చేరాయి. నెల రోజుల కింద ట్రయల్​ రన్​ నిర్వహించిన ఇరిగేషన్​ అధికారులు పెండింగ్​ పనులపై దృష్టి పెట్టారు. మెయిన్ ​కెనాల్  నుంచి సాగుకు నీరు మళ్లించుకునేందుకు అవకాశాలు మెరుగయ్యాయి.​ 

29వ ప్యాకేజీలోని గుడిపల్లిగట్టు రిజర్వాయర్​ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాడ్గుల మండలం చివరి భూములకు సాగునీటిని అందించేందుకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కృషి చేశారు. వెల్దండ, ఆమనగల్లు, మాడ్గుల మండలాల రైతాంగానికి సాగునీటిని అందిస్తానని చెప్పి ఎట్టకేలకు నీటిని అందించగలిగారు.

ఆయకట్టు కుదింపు..

తుంగభద్ర డ్యాం గేట్ల మార్పిడి, రిపేర్ల కారణంగా ఆర్డీఎస్​ కింద ఈ సీజన్​లో క్రాప్​ హాలిడే ప్రకటించారు. దీంతో యాసంగిలో  దాదాపు 84 వేల ఎకరాల్లో సాగు నిలిచిపోనుంది. పీజేపీ, భీమా, ఇతర ప్రాజెక్టుల కింద ఆయకట్టును కుదించారు. మహబూబ్​నగర్​ జిల్లాలో 30 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించాలని ఇరిగేషన్​ ఆఫీసర్లు నిర్ణయించారు.