తులసివనంలో గంజాయిలా కాంగ్రెస్.. త్వరలో ఆ పార్టీ అడ్రస్‌ గల్లంతు: ఎంపీ లక్ష్మణ్

తులసివనంలో గంజాయిలా కాంగ్రెస్.. త్వరలో ఆ పార్టీ అడ్రస్‌ గల్లంతు: ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కుట్రలతో పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ హెచ్చరించారు. తులసి వనంలో గంజాయి అనే మాట అక్షరాలా కాంగ్రెస్ పార్టీకే వర్తిస్తుందని చెప్పారు. సీఎం హోదాలో ఉండి మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తన స్థాయిని తానే చులకన చేసుకుంటున్నారన్నారు. జాతీయ పార్టీ హోదా కోల్పోయి, అస్తిత్వం కోసం ఆరాటపడుతున్న సీపీఐ సభలకు సీఎం వెళ్లడం విడ్డూరంగా ఉందని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. 

సీపీఐకి పట్టిన గతే త్వరలో కాంగ్రెస్‌కు కూడా పట్టబోతోందని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి అస్తిత్వం సవాల్‌గా మారిందని, అధికారం మాట దేవుడెరుగు.. కనీసం మనుగడ సాగించడానికి ఆరాటపడాల్సిన దుస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తీరుతో దేశ ప్రజల్లో ఆ పార్టీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోందని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో నవ భారత్ నిర్మాణం జరుగుతోందని, ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని తెలిపారు. మోదీపై రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు అసహ్యించుకుంటారన్నారు.