
తెలంగాణలో ఎక్కడ చూసినా..డ్రగ్స్ మాఫియా, లిక్కర్ మాఫియా నడుస్తుందని రాజ్యసభ సభ్యులు డా. కే లక్ష్మణ్ ఆరోపించారు. పల్లెల్లో మహిళలు యుక్త వయసులో వితంతువులవుతున్నారని..దీనికి కారణం గ్రామాల్లో మద్యం ఏరులై పారడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన..పటాన్ చెరు (మం) చిన్నకంజర్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఓట్ల కోసం కొందరు హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారని ఎంపీ కే. లక్ష్మణ్ మండిపడ్డారు. ఓ వర్గం ఓట్ల కోసం ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. హిందువులను ఎవరైనా కించపరిస్తే ప్రతి ఒక్కరు శివాజీ కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలను ఇబ్బందులు పెట్టిన నిజాంను ఓట్ల కోసం కొందరు పొగుడుతున్నారని తెలిపారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.