
బీహార్ రాజధాని పాట్నాలో సంచలనం సృష్టించిన వ్యాపారి గోపాల్ ఖేమ్కా హత్య కేసులో కీలక నిందితుడు ఎన్ కౌంటర్ కు గురయ్యాడు. సోమవారం (జులై 07) రాత్రి పోలీసుల ఎన్ కౌంటర్ లో నిందితుడు వికాస్ అలియాస్ రాజా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆయుధాలు తయారు చేసి, నిందితులకు అమ్మడంతో పాటు హత్య జరుగుతున్న సమయంలో హంతకుడు ఉమేశ్ తో పాటు వెళ్లినట్లు వికాస్ పై ఆరోపణలు ఉన్నాయి.
సోమవారం రాత్రి బీహార్ పోలీసులు వికాస్ ను ఎన్ కౌంటర్ చేశారు. ఘటనా స్థలంలో వికాస్ దగ్గర నుంచి పిస్టల్, బుల్లెట్లతో పాటు ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్ కౌంటర్ అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
బీహార్ రాజధాని పాట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి ఆయనను కాల్చి చంపారు. శుక్రవారం (జూలై 4) రాత్రి గాంధీ మైదాన్ ప్రాంతంలోని తన అపార్ట్‌మెంట్ దగ్గర కారు దిగగానే దుండగులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ గోపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. గోపాల్ ఖేమ్కా కుమారుడు గుంజన్ ఖేమ్కా కూడా 6 సంవత్సరాల క్రితం ఇదే తరహాలో హత్యకు గురికావడం గమనార్హం. గుర్తు తెలియని దుండగులు గుంజన్ ఖేమ్కాను కూడా బైకుపై వచ్చి కాల్చి చంపారు.
ALSO READ : జాతీయ మత్స్య బోర్డు ఏపీకి తరలించే కుట్ర .. కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లెటర్ !
ఈ కేసులో హంతకులకు ఆయుధాలు సమకూర్చడంతో పాటు హత్య జరుగుతున్నపుడు అక్కడే ఉంటూ సహకరించడంపై ఇప్పటికే వికాస్ పై కేసు నమోదైంది. సోమవారం రాత్రి నిందితుడిని ఎన్ కౌంటర్ చేయడం బీహార్ లో సంచలనం సృష్టిస్తోంది.