
నాగర్‌కర్నూల్, వెలుగు: కృష్ణా బేసిస్లోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కేసీఆర్, హరీశ్ రావు కారణమని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. సోమవారం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉంటే, ఏపీలో 31.5 శాతం ఉందని, దీనికి తగ్గట్లుగానే 811 టీఎంసీలలో తెలంగాణకు 512 టీఎంసీలు, ఏపీకి 299 టీఎంసీలు కేటాయించాల్సి ఉందన్నారు.
ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే వాడుకునేలా అంగీకరించింది మామ, అల్లుళ్లు కాదా? అని నిలదీశారు. మీరు చేసిన పాపాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పులు మీరు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు మోపుతారా? అంటూ ఫైర్ అయ్యారు. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు.
రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. తెలంగాణ వాటా నీటి హక్కులను ఏపీకి ధారాదత్తం చేసి, పాలమూరు– -రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టులను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారన్నారు. పదేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు,- -రంగారెడ్డి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌తో సహా అనేక ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు.
అధికారం వెలగబెట్టినప్పుడు ప్రాజెక్టులను పట్టించుకోని నాయకులు.. ఇప్పుడు ప్రజా ఉద్యమాలు చేస్తారంట.. అని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కృష్ణా బేసిన్‌లోని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లన్నీ పూర్తి చేసి సాగునీటిని అందిస్తుందని మంత్రి తెలిపారు.