యాదాద్రికి బొగ్గు సప్లైకి రెడీ అవ్వండి

యాదాద్రికి బొగ్గు సప్లైకి రెడీ అవ్వండి
  • బొగ్గు రవాణాపై రైల్వే అధికారులతో  జెన్కో సీఎండీ సమీక్ష
  • ఈ నెలాఖరులో మరో యూనిట్ ప్రారంభానికి సన్నాహాలు

హైదరాబాద్​, వెలుగు: యాదాద్రి పవర్ ప్లాంట్​కు అవసరమయ్యే బొగ్గు సరఫరాకు సన్నద్దం కావాలని జెన్కో సీఎండీ హరీశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జెన్‌‌‌‌కో సీఎండీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైల్వే సైడింగ్​ నిర్మాణ పురోగతి, బొగ్గు రవాణా లాజిస్టిక్స్‌‌‌‌పై చర్చించారు. డిసెంబర్ నాటికి అవసరమైన బొగ్గు సరఫరాకు సన్నద్ధం కావాలని సీఎండీ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. 

ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే ఆపరేషన్స్ మేనేజర్ కె.పద్మజ (ఐఆర్‌‌‌‌టీఎస్) మాట్లాడుతూ రైల్వే నెట్‌‌‌‌వర్క్ ద్వారా బొగ్గు రవాణాకు రెడీగా ఉన్నామని తెలిపారు. రద్దీని తట్టుకునేందుకు డోర్నకల్-–భద్రాచలం రోడ్​, మొటమర్రి–విష్ణుపురం రైల్వే లైన్ల డబ్లింగ్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో సింగరేణి నుంచి పూర్తి బొగ్గు డిమాండ్‌‌‌‌ను తీర్చడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, ప్రత్యామ్నాయ బొగ్గు వనరులను పరిశీలించాలని రైల్వే అధికారులు జెన్‌‌‌‌కోకు సూచించారు. 

ఈ సమీక్షా సమావేశంలో జెన్కో డైరెక్టర్ (కోల్ ,లాజిస్టిక్స్) బి.నాగ్య (ఐఆర్‌‌‌‌టీఎస్), డైరెక్టర్ (సివిల్)  ఎ.అజయ్, దక్షిణ మధ్య రైల్వే సీఎఫ్‌‌‌‌టీఎం ఆర్.సుదర్శన్ (ఐఆర్‌‌‌‌టీఎస్) తదితరులు పాల్గొన్నారు. కాగా, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు జెన్​కో సమాయత్తమవుతున్నది. ఈ పవర్ స్టేషన్‌‌‌‌లోని రెండో యూనిట్ ఇప్పటికే జనవరి 2025లో ప్రారంభమైంది. మొదటి యూనిట్ ఈనెలాఖరులో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మిగిలిన మూడు యూనిట్లు 2026 ఫిబ్రవరి నాటికి పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి.