టోకెన్లు జారీ చేసిన రూ.1,500 కోట్ల ఫీజు బకాయిలు ఇవ్వండి.. డిప్యూటీ సీఎంకి ప్రైవేట్ కాలేజీల వినతి

టోకెన్లు జారీ చేసిన రూ.1,500 కోట్ల  ఫీజు బకాయిలు ఇవ్వండి.. డిప్యూటీ సీఎంకి ప్రైవేట్ కాలేజీల వినతి
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి ప్రైవేట్ కాలేజీల మేనేజ్‌‌మెంట్ల వినతి
  • ‘ట్రస్ట్ బ్యాంక్’ ప్రపోజల్స్‌‌పై కమిటీ వేసిన సర్కార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేట్ ప్రొఫెషనల్, నాన్-ప్రొఫెషనల్ కాలేజీలకు సంబంధించి టోకెన్లు జారీ చేసిన రూ.1500 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌‌స్టిట్యూషన్స్ (ఫాతి) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమవారం సెక్రటేరియెట్​లో ఫీజుల బకాయిలపై ప్రైవేట్ కాలేజీల మేనేజ్‌‌మెంట్లు, అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాలుగేండ్ల నుంచి సుమారు రూ.8 వేల కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌‌లో ఉన్నాయని ఫాతి చైర్మన్ డాక్టర్ అరోరా రమేశ్ తెలిపారు. వాటిని వాయిదాల పద్ధతిలో చెల్లించి, కాలేజీలను కాపాడాలని కోరారు. 

ఈ క్రమంలో ఫీజు రీయింబర్స్‌‌మెంట్ ఇష్యూ లేకుండా రాష్ట్రంలో ఆర్‌‌బీఐ గైడ్‌‌లైన్ ప్రకారం ‘ట్రస్ట్ బ్యాంక్ సిస్టమ్’ ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రూ.1,500 కోట్లతో సీడ్ ఫండ్ ఇచ్చి, ఇతర సంస్థలకు సంబంధించి అన్నింటినీ దాని ద్వారానే ట్రాన్సాక్షన్స్ అయ్యేలా చూడాలని, తద్వారా ప్రభుత్వానికి బ్యాంకు వడ్డీ ద్వారా వచ్చే మొత్తం ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌తో పాటు పలు స్కీములకు ఉపయోగపడుతుందన్నారు. 

దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఫాతి ప్రతినిధులు ఇచ్చారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. ట్రస్ట్ బ్యాంక్ సిస్టమ్‌‌పై స్టడీ చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే సీఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో కమిటీ వేయనున్నట్టు వారికి తెలిపారు. వారంలో రిపోర్టు ఇవ్వనున్నారని, దాని ఆధారంగా సాధ్యాసాధ్యలను పరిశీలిస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారని ఫాతి ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి,  ‘ఫాతి’ నాయకుటు కేఎస్ రవి కుమార్, కొడాలి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.