నాపై వేటు ఫలితమే 63 మంది ఓటమి : మహువా మొయిత్రా

నాపై వేటు ఫలితమే 63 మంది ఓటమి : మహువా మొయిత్రా

న్యూఢిల్లీ: తన గొంతును అణిచివేసినందుకు బీజేపీ భారీ మూల్యం చెల్లించుకుందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. గతంలో తనను లోక్​సభ నుంచి సస్పెండ్ చేసినందుకే ఇటీవలి ఎన్నికల్లో బీజేపీకి చెందిన 63 మంది ఎంపీలను ప్రజలు ఇంటికి పంపించారని తెలిపారు. సోమవారం లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మెుయిత్రా మాట్లాడారు. "గత లోక్ సభలో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. నా గొంతును అణిచివేసేందుకు అధికార పార్టీ ప్రయత్నించింది. నా లోక్​సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది.

అందుకే ఇప్పుడు బీజేపీ భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన 63 మంది ఎంపీలను ప్రజలు ఇంటికి పంపించారు"  అని మొయిత్రా పేర్కొన్నారు. బీజేపీకి స్పష్టమైన మెజార్టీ లేదని, మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తిందని ఎద్దేవా చేశారు. ఏదో ఒకరోజు ఈ ప్రభుత్వం కూడా కూలిపోతుందని జోస్యం చెప్పారు. పార్లమెంటులో సెంగోల్‌‌ను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించిన ఆమె.. ఇది ప్రజాస్వామ్యంలో రాచరికానికి నిదర్శనమని వెల్లడించారు. పార్లమెంటులో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో మెుయిత్రా గత లోక్ సభలో బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే.