ప్రమాదానికి, మీటింగ్ కు సంబంధం లేదు : ఎంపీ నామా

ప్రమాదానికి, మీటింగ్ కు సంబంధం లేదు : ఎంపీ నామా

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి, సిలిండర్ పేలుడు ఘటనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ నామా నాగేశ్వర్ రావు చెప్పారు. తాము ఏర్పాటు చేసుకున్న మీటింగ్ కు 200 మీటర్ల దూరంలో ప్రమాదం జరిగిందన్నారు.  మీటింగ్ ప్రారంభయ్యే సమయంలో తామంతా స్టేజీపై ఉన్నామని, అప్పుడే సిలిండర్ పేలిందని తనదైన స్టైల్లో చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఎండల తీవ్రత వల్ల గ్యాస్ సిలిండర్ పేలి ఉండొచ్చన్నారు. చిన్న గుడిసెలో ఉన్నటువంటి గ్యాస్ పేలడం వల్లే ప్రమాదం జరిగిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తప్పనిసరిగా బాధితులను ఆదుకుంటామని ఎంపీ నామా చెప్పారు. బాణాసంచా కాల్చడం వల్లే ప్రమాదం జరగలేదని మాత్రం చెప్పే ప్రయత్నం చేశారు. గుడిసెలో సిలిండర్ ఉన్న విషయం ఎవరికీ తెలియదన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ కు కూడా తరలించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ను ఆదేశించామన్నారు. 

ఆదుకుంటాం : ఎమ్మెల్యే రాములు నాయక్

బాణా సంచా వల్లే సిలిండర్ పేలిందని తాము ఇప్పుడే చెప్పలేమని ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. ‘‘సంతోషంలో కార్యకర్తల బాణాసంచా కాలుస్తుంటారు. నిర్లక్ష్యం మాత్రం ఏమీ లేదు. బాధితులను తప్పనిసరిగా ఆదుకుంటాం. ప్రస్తుతం ఈ విషయంలో అందరూ స్పందించాలె. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం దర్యాప్తులో తేలుతుంది’’ అని చెప్పుకొచ్చారు. 

సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఊహించని రీతిలో సిలిండర్ పేలి.. ఇద్దరు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్ర గాయాలు పాలయ్యారని తెలిసిన వెంటనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు కూడా ఫోన్ చేసి, ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు. మరోవైపు.. మంత్రి కేటీఆర్ కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకుంటామని స్పష్టం చేశారు.