పోలీసులను అడ్డు పెట్టుకొని టీఆర్ఎస్ డ్రామాలు

పోలీసులను అడ్డు పెట్టుకొని టీఆర్ఎస్ డ్రామాలు

తెలంగాణ రాష్ట్రంలో పోలీసులను అడ్డు పెట్టుకుని టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోందని రాజ్యసభ ఎంపీ ఓం ప్రకాష్ మాథుర్ (MP Om Prakash Mathur) మండిపడ్డారు. తాను ఎన్నో రాష్ట్రాలు తిరిగాను.. కానీ ఇలాంటి నిర్భందం ఎక్కడా చూడలేదని వెల్లడించారు. హనుమకొండకు వచ్చిన ఆయన బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. అయితే.. బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన ధర్నాతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఎంపీ ఓం ప్రకాష్ మాథుర్ మీడియాతో మాట్లాడారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన ఆసహనం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజలను కలవడానికి జాతీయ నేతలు వచ్చారని, అందులో భాగంగా తాను బీజేపీ శ్రేణులను నిన్నటి నుండి కలుస్తున్నట్లు చెప్పారు. బీజేపీ సమావేశాలను అడ్డుకోవడానికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించారని తెలిపారు. శాంతియుత సమావేశాలను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. నిరసన పేరిట కాంగ్రెస్ శ్రేణులు దాడులకు తెగబడ్డారని విమర్శించారు. హైదరాబాద్ లో జూలై 02, 03 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు (BJP National Meeting) జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా.. బీజేపీకి చెందిన 347 మంది జాతీయ నేతలను పార్టీ అధిష్టానం 119 నియోజకవర్గాలకు పంపింది. ఆయా నియోజకవర్గాల్లో  పార్టీ పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు మోడీ సభకు జన సమీకరణపైనా దృష్టిపెట్టారు.

హనుమకొండకు ఎంపీ ఓం ప్రకాష్ మాథుర్ వచ్చారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. అదే సమయంలో అగ్నిపథ్ ను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ ఆఫీసు వద్ద ధర్నా చేశారు. కార్యాలయంపైకి దాడి చేసేందుకు వస్తున్నారన్న సమాచారం తెలుసుకుని బీజేపీ నేతలు వారిని అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. నేతల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. దాడుల్లో సుబేధారి సీఐ గన్ మన్ కు గాయాలయ్యాయి. పోలీసుల వ్యవహరించిన తీరును బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు.