
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరిన ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కౌన్సెలింగ్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలులో అక్రమాలు జరుగుతున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. అక్రమాలను సరిదిద్దడానికి వెంటనే చర్యలు చేపట్టి జీవో నంబర్ 550ని పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కౌన్సెలింగ్ లో రిజర్వేషన్ల అమలులో జరుగుతున్న అన్యాయంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను శనివారం సెక్రటేరియట్ లో ఆర్. కృష్ణయ్య తన బృందంతో కలిశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెరిట్ లో ఓపెన్ కాంపిటీషన్ లో వచ్చిన అభ్యర్థులను రిజర్వేషన్లకు చేర్చి ఈ వర్గాలకు రావాల్సిన కోటాను తగ్గిస్తున్నారని మండిపడ్డారు. కొత్త జీవో 144 తెచ్చి కాలేజ్ ఆప్షన్ పేరుమీద ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు.