
ముషీరాబాద్, వెలుగు: దేశంలోని బీసీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక స్కీములను రూపొందించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. మంగళవారం ఆయన కాచిగూడలోని ఓ హోటల్ లో జరిగిన 16 బీసీ సంఘాల సమావేశానికి హాజరై, మాట్లాడారు. బీసీల కోసం మండల కమిషన్ 40 సిఫారసులు చేస్తే రెండింటిని మాత్రమే ఆమలు చేశారని గుర్తుచేశారు. రాజ్యాంగబద్ధమైన కమిషన్ చేసిన సిఫారసులకు కూడా విలువ లేదా అని ప్రశ్నించారు. ఈర్ష, ద్వేషాలతో బీసీలను అణిచివేస్తున్నారని విమర్శించారు.
బీసీల అభివృద్ధికి 74 ఏండ్ల క్రితమే ప్రత్యేక పథకాలను తీసుకురావాల్సిందని.. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో బీసీలు అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జనగణలో కులగణన చేయాలని.. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై 16 పార్టీలు మద్దతు ఇచ్చాయని ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. సమావేశంలో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, కే రాము , వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు నీల వెంకటేశ్, పగడాల సుధాకర్ ముదిరాజ్, వేముల రామకృష్ణ, రాజేందర్, అనంతయ్య, నిఖిల్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.