రఘురామకృష్ణ రాజు ఖైదీ నెంబర్ 3468

రఘురామకృష్ణ రాజు ఖైదీ నెంబర్ 3468
  • గుంటూరు జిల్లా జైలు పాత బ్యారక్ లో ఒక సెల్ కేటాయింపు

అమరావతి: ఎంపీ రఘురామకృష్ణ రాజుకు గుంటూరు జిల్లా జైలు అధికారులు ఖైడీ నెంబర్ 3468 కేటాయించారు. జైలులోని పాత బ్యారక్ లో ఒక సెల్ ను ఆయనకు కేటాయించారు. తనను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని.. తీవ్రంగా కొట్టి హింసించారని రఘురామకృష్ణ రాజు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన గుంటూరు సీఐడీ కోర్టు మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దాదాపు 18 రకాల వైద్య పరీక్షలు చేసినట్లు సమాచారం. మెడికల్ బోర్డు డాక్టర్లు సీల్డ్ కవర్లో సమర్పించిన నివేదికను సీఐడీ కోర్టు న్యాయస్థానం నుండి హైకోర్టుకు చేరింది. జస్టిస్ ప్రవీణ్ కుమార్ నివాసానికి సీల్డ్ కవర్ నివేదిక పంపిన కాసేపటికే హైకోర్టు డివిజన్ బెంచ్ లో రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ పై విచారణ మొదలైంది. తీవ్ర స్థాయిలో వాదోప వాదాలు జరిగినట్లు కోర్టు వర్గాల సమాచారంతో హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణపై ఉత్కంఠ ఏర్పడింది. విచారణ కొద్దిసేపటి క్రితం ముగిసినందున ఏ క్షణమైనా హైకోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
రాత్రికి చంపేయాలని చూస్తున్నారు: రఘురామకృష్ణ రాజు భార్య రమాదేవి 
తన భర్త ఎంపీ రఘురామకృష్ణ రాజును ఈ రోజు రాత్రికి చంపేయాలని చూస్తున్నారని ఆయన భార్య రమాదేవి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ తన భర్తను ఆసుపత్రిలో ఉంచి ఆరోగ్యం పరిరక్షించాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోకుండా ఏకపక్షంగా జైలుకు తరలించారని ఆరోపించారు. కోర్టు నిబంధనలను టించకపోతే ఎలా అని ప్రశ్నించారు. రమేష్ ఆసుపత్రికి తరలించాలని కోరితే పట్టించుకోవడం  లేదని వాపోయారు. అసలేం జరుగుతుందో తనకు అర్ధం కావడం లేదని.. హత్యలు చేసే వారు రోడ్లపై తిరుగుతుంటే.. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారిని చట్టసభ సభ్యులని చూడకుండా జైల్లో పడతారా అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.