
- రద్దు చేసిన పర్మిషన్లను మళ్లీ ఇచ్చిందెవరు?
- వెంటనే విచారణ చేయాలి: ఎంపీ రఘునందన్ రావు
హైదరాబాద్, వెలుగు: నార్సింగిలో ఆదిత్య వింటేజ్ అక్రమ కట్టడాల వెనకున్న కాంగ్రెస్ నేతల పేర్లు బయటపెట్టాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. రింగ్ రోడ్డు పక్కనున్న సర్వీస్ రోడ్డును తొలగించి నిర్మాణాలు చేస్తున్నారని, హెచ్ఎండీఏ ఆఫీసర్లు పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారన్నారు. నిర్మాణాలకు పర్మిషన్లు రద్దు చేసినా మళ్లీ అనుమతులు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. నీళ్లలో కడుతున్న నిర్మాణాల ఫొటోలను సీఎం రేవంత్‌కు పంపిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ అక్రమాల్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఆదిత్య వింటేజ్ కు అనుమతులు ఇవ్వడం వెనుక ఉన్న మంత్రులెవరు?’ అని ప్రశ్నించారు.
గత ప్రభుత్వం కాళేశ్వరం పేరు జపిస్తే.. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నది శుద్ధి గురించి మాట్లాడుతున్నదన్నారు. కానీ మూసీ క్యాచ్‌మెంట్ ఏరియాలో పెద్ద రియల్ ఎస్టేట్ నిర్మాణాలు వస్తున్నాయని విమర్శించారు. ఒకవైపు పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లను హైడ్రా కూల్చివేస్తున్నదని, మరో వైపు అస్మదీయులకు, రియల్ ఎస్టేట్ బడా బాబులకు ప్రభుత్వం అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నదని ఆరోపించారు. గండిపేట జలాశయం 12 గేట్లు 4 ఫీట్లు ఎత్తితేనే పరిస్థితి ఇలా ఉంటే.. అన్ని గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తితే ఈ నిర్మాణాలు, ప్రజల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ కట్టడాలపై సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ స్పందించాలని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.