
రామచంద్రాపురం/ హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న లింగంపల్లి చౌరస్తా నుంచి అమీన్పూర్ పరిధిలోని సల్తాన్పూర్ ఓఆర్ఆర్ వరకు రూ.100 కోట్లతో కొత్త రోడ్డు నిర్మిస్తామని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. బీహెచ్ఈఎల్ ముఖద్వారం నుంచి అమీన్పూర్ మున్సిపాలిటీ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు నిర్మించేందుకు ప్రపోజల్స్ తయారు చేశామని చెప్పారు.
మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్తో కలిసి లింగంపల్లి చౌరస్తా వద్ద స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ లిగంపల్లి నుంచి అమీన్పూర్ మీదుగా సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వరకు రోడ్డు నిర్మించాలని ఏడాదిగా అధికారులను కోరుతున్నానని చెప్పారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే అమీన్పూర్, సుల్తాన్పూర్, బొల్లారంతో పాటు శేరిలింగంపల్లి వాసులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 100 రోజుల్లో రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరారు.
లింగంపల్లి చౌరస్తా నుంచి అమీన్ పూర్ మీదుగా సుల్తాన్ పూర్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వరకు రోడ్డు విస్తరణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఇంజనీర్లను ఆదేశించారు. ఆయన వెంట దిశ కమిటీ సభ్యులు కాసాల సుధాకర్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఎడ్ల రమేశ్, ఆర్సీపురం డివిజన్ ప్రెసిడెంట్ నర్సింగ్ గౌడ్, ఆంజనేయులు, ఈర్ల రాజు, కొండా లక్ష్మణ్, సంతోష్ గౌడ్ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ బోర్కడే హేమంత్ సహదేవ్ రావు, చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.