ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఈనెల 28 వరకు రిమాండ్

ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఈనెల 28 వరకు రిమాండ్
  • వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించాలని ఆదేశం
  • ముందుగా గుంటూరు జీజీహెచ్ కు.. ఆ తర్వాత రమేష్ ఆసుపత్రికి తరలించాలన్న కోర్టు
  • ఆరోగ్యం మెరుగయ్యే వరకు జైలుకు తరలించొద్దన్న కోర్టు

అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఈనెల 28 వరకు రోజుల రిమాండ్‌ విధిస్తూ గుంటూరు  సీఐడీ కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. రాజుకు 14 రోజులు పోలీస్‌ కస్టడీకి అనుమతించిన కోర్టు ఆయన ఆరోగ్యం బాగయ్యే వరకు జైలుకు తరలించొద్దని ఆదేశించింది. వెంటనే వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించాలని.. తొలుత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలన్న కోర్టు ఆదేశించింది. ఎంపీకి వై కేటగిరి భద్రత కొనసాగించాలని సీఐడీ కోర్టు స్పష్టం చేసింది. 
హడావుడిగా సీఐడీ కోర్టులో బెయిల్ పిటిషన్
రఘురామకృష్ణ రాజుకు హైకోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో వెంటనే సీఐడీ కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ నిన్న హైదరాబాద్ లో ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ కోసం రఘురామకృష్ణం రాజు పెట్టుకున్న హౌస్ మోషన్ పిటిషన్ పై శనివారం తొలుత హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ ప్రారంభమైన వెంటనే సీఐడీ జిల్లా కోర్టుకు కాకుండా నేరుగా ఎందుకొచ్చారంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తిని సరైన కారణాలు లేకుండా అరెస్టు చేసి రిమాండుకు పంపాలని పిటిషనర్ తరపు న్యాయవాది తెలియజేశారు. ప్రాథమిక విచారణగాని, కనీస ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని రాజు తరఫు లాయర్ వాదించారు. ప్రభుత్వం, పోలీసుశాఖ తరపున ఏఏజీ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, అందుకే అరెస్టు తప్పలేదన్నారు. ఆయనను రిమాండకు పంపుతామని హైకోర్టుకు తెలుపగా ఆయన ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలంటూ రఘురామకృష్ణం రాజు పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ.. బెయిల్ పిటిషన్ ను త్వరగా విచారించాల్సిందిగా కింది కోర్టుకు ఆదేశాలిచ్చింది. ఈ నేపధ్యంలో ఆయన లాయర్లు హుటాహుటిన గుంటూరు సీఐడీ కోర్టులో పిటిషన్ వేయగా రాత్రి వరకు వాదనలు జరిగాయి. అనంతరం 14 రోజుల రిమాండ్ కు ఆదేశించినా ఆయన ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కో్ర్టు ఆదేశించింది.