- బీజేపీపై ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్
- రిజర్వేషన్లపై పరిమితిని తొలగించడం అపలేరని కామెంట్
- రాంచీ ‘సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్’ సభలో కేంద్రంపై మండిపాటు
రాంచీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఎన్నికల కమిషన్(ఈసీ), ఎన్ఫోర్స్మెంట్డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీలు, టాప్బ్యూరోక్రసీని కంట్రోల్ చేస్తున్నదని రాహుల్ గాంధీ ఆరోపించారు. అలాగే కుల గణనను, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించడాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని అన్నారు. శనివారం ఆయన రాంచీలో నిర్వహించిన ‘సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్’కు హాజరయ్యారు.
ఇందులో రాహుల్ ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్షా, బీజేపీ నేతలు రాజ్యాంగంపై దాడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నిరంతర దాడుల నుంచి రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘సంస్థలను, నిధులను కూడా బీజేపీ నియంత్రిస్తున్నది. మేం నిజాయితీపరులం.. డబ్బు లేకుండానే కాంగ్రెస్పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోరాడింది’’ అని రాహుల్ అన్నారు. అలాగే దేశ విద్యావ్యవస్థలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల చరిత్రకు ఇచ్చిన స్థానం ఎంతని ప్రశ్నించారు.
కులగణన సామాజిక ఎక్స్రే
కులగణన అనేది సమాజాన్ని ఎక్స్-రే తీసే ఒక సాధనమని.. దీన్ని మోదీ వ్యతిరేకిస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. మీడియా, జ్యూడీషియరీ సపోర్ట్ లేకపోయినా కులగణనను పూర్తిచేస్తామని.. రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని తొలగించడాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని ఆయన చెప్పారు. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతుల(ఓబీసీ) హక్కులను బీజేపీ, ప్రధాని మోదీ లాగేసుకుంటున్నారని ఆరోపించారు.
ప్రధాని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను గౌరవిస్తానని అంటూనే మీ హక్కులను లాక్కుంటున్నారని విమర్శించారు. “వనవాసీలు అని పిలుస్తూ వేల ఏండ్ల మీ చరిత్రను, జీవనవిధానాన్ని, మీ నాగరికతను నాశనం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నది” అని రాహుల్ అన్నారు. ‘‘మన దేశ విద్యావ్యవస్థలో ఆదివాసీల గురించి కేవలం 10 నుంచి 15 లైన్లు మాత్రమే కనిపిస్తాయి. వారి చరిత్ర, జీవన విధానం గురించి ఏమీ రాయలేదు.
సమాజంలో వివిధ వృత్తులు చేసే అత్యధికులకు ఓబీసీ అనే పదం వాడారు.. మీరు వెనుకబడ్డారని ఎవరు చెప్పారు? మీకు హక్కులు నిరాకరించారు. ఈ దేశాన్ని నిర్మించింది రైతులు, కూలీలు, వడ్రంగులు, క్షురకులు.. ఇలాంటి సకల వృత్తుల వారు” అని రాహుల్ గాంధీ అన్నారు.