- బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు డిమాండ్
హైదరాబాద్, వెలుగు: మూసీ మోడ్రనైజేషన్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుందో ప్రభుత్వం చెప్పాలని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఒకసారి సీఎం రేవంత్ లక్ష కోట్లని, మరోసారి లక్షా 50 వేల కోట్లు అని పలుసార్లు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. మూసీ సుందరీకరణ కోసం చేస్తున్న ఖర్చుపై వైట్‌పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం అసెంబ్లీ క్వశ్చన్ అవర్‌లో ‘మూసీ ప్రక్షాళన’ అంశంపై హరీశ్‌రావు మాట్లాడారు. నిధులు కొరత ఉందని చెబుతున్న ప్రభుత్వం.. మూసీకి లక్షల కోట్లు ఎలా పెడుతుందని హరీశ్‌రావు ప్రశ్నించారు. “మూసీ సుందరీకరణలో ఇప్పటివరకు ఎన్ని నివాసాలు కూల్చారు? కూల్చిన వాటికి 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారం ఇచ్చారా? వేజ్ లాస్ చెల్లించారా? లేదా కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో వారిని అసైన్‌మెంట్ చేసి చేతులు దులుపుకున్నారా? 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ. 14.5 లక్షలు ఇవ్వాలి. వాళ్ల పాత ఇంటికి ఆర్ అండ్ బీ ఎస్టిమేట్ చేసి ఆ డబ్బులు చెల్లించాలి.
అలాగే సేలబుల్ రైట్స్‌తో కూడిన 200 గజాల స్థలం, ఇల్లు ఇవ్వాలి. ఇవి ఇచ్చారా? ఇవ్వలేదా? ఒకవేళ ఇస్తే ఎప్పటిలోగా ఇస్తారు? ప్రభుత్వం ఐడెంటిఫై చేసిన కూల్సాల్సిన ప్రభుత్వ, ప్రైవేట్ కట్టడాలు ఎన్ని? ఎంత భూమిని ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరిస్తున్నారు? ” అని అడిగారు. మూసీ అభివృద్ధి కోసం ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయని, అక్కడ మూసీ సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. మూసీ పేరిట పేదల ఇండ్లు కూలిస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు
