కేంద్రం పేదలను దోచి పెద్దలకు పెడుతోంది: రాహుల్ గాంధీ

కేంద్రం పేదలను దోచి పెద్దలకు పెడుతోంది: రాహుల్ గాంధీ

కోర్బా :  కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కొంతమంది వ్యాపారవేత్తలకు దోచిపెడుతున్నదని కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. పేద ప్రజలను మాత్రం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ‘‘మన దేశ ఆర్థిక వనరులను కొంతమంది వ్యాపారవేత్తలు కొల్లగొడుతున్నారు. మిమ్మల్ని మోసం చేస్తున్నారు.. దోచుకుంటున్నారు. ఇకనైనా మేల్కొండి” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా సోమవారం చత్తీస్ గఢ్ లోని సీతామఠిలో నిర్వహించిన సభలో రాహుల్ మాట్లాడారు. దేశంలోని టాప్ 200 కంపెనీలలో ఒక్కటన్నా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందినది లేదని ఆయన పేర్కొన్నారు. 

పెద్ద పెద్ద ఆస్పత్రులు, యూనివర్సిటీలు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తలను మీరెప్పుడైనా చూశారా? అని ప్రశ్నించారు. దేశంలో కొన్ని వర్గాల గుత్తాధిపత్యం నడుస్తున్నదని మండిపడ్డారు. ‘‘మా బతుకు ఇంతేనని.. మీకు మీరు అనుకుని నిద్రపోతున్నారు. ‘జైశ్రీరామ్’ అంటూ 24 గంటలూ ఆ దేవుడిని తలుచుకుంటున్నారు. అది మంచిదే కానీ.. వాళ్లు మీ డబ్బును రోజూ దోచుకుంటున్నారు. మీరేమో ఆకలితో సచ్చిపోతున్నారు. ఇకనైనా ప్రశ్నించడం మొదలుపెట్టండి. మీకు రావాల్సిన ఫండ్స్, దేశ వనరుల్లో మీకు దక్కాల్సిన వాటాపై నిలదీయండి” అని పిలుపునిచ్చారు. 

అయోధ్య వేడుకలో పేదలేరీ?  

కార్పొరేట్ పెద్దలు అదానీ, అంబానీ మన దేశంలో చైనా వస్తువులను అమ్ముతూ ప్రజలను దోచుకుంటున్నారని రాహుల్ మండిపడ్డారు. ‘‘అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో పేదలు, కార్మికులు, నిరుద్యోగులను గానీ, చిన్న చిన్న వ్యాపారవేత్తలను గానీ మీరు చూశారా? నేను కేవలం పెద్ద పెద్ద బిజినెస్ మెన్ అదానీ జీ, అంబానీ జీ, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ లాంటి వాళ్లను చూశాను” అని చెప్పారు. ‘‘నేను మాట్లాడేది మీడియాలో ఎందుకు రాదని మీరు నన్ను అడుగుతూ ఉంటారు. నేను ఇలాంటి విషయాలు మాట్లాడుతాను కాబట్టే నన్ను మీడియాలో చూపించరు. మోదీ జీ, అంబానీ జీ, అదానీ జీ, రామ్ దేవ్ బాబా 24 గంటలూ కనిపిస్తారు” అని తెలిపారు. కాగా, ఎక్కువ సేపు ఫోన్ చూడొద్దని, అది ఆరోగ్యానికి మంచిది కాదని రాహుల్ సూచించారు.