బీఆర్​ఎస్​కు ఎంపీ రాములు గుడ్​బై!

బీఆర్​ఎస్​కు ఎంపీ రాములు గుడ్​బై!
  • ఆ పార్టీతో ప్రయాణం ముగిసిందని ప్రకటన
  • పార్టీ మీటింగులకు పిలుపు అందకపోవడంతో అసంతృప్తి
  • నాగర్ కర్నూల్ జిల్లాలో పార్టీ మీటింగులకు అందని పిలుపు​
  • బీఆర్ఎస్​తో నా ప్రయాణం ముగిసింది: ఎంపీ రాములు

నాగర్ కర్నూల్, వెలుగు: నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు బీఆర్ఎస్​కు గుడ్​బై చెప్పడం ఖాయమైంది. ‘ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలకు నన్ను ఆహ్వానించలేదు.. బీఆర్ఎస్ తో నా ప్రయాణం ముగిసింది’ అని ఎంపీ రాములు ఆదివారం కొందరు మీడియా ప్రతినిధులకు స్పష్టం చేశారు. నాగర్​కర్నూల్ పార్లమెంట్​నియోజకవర్గం పరిధిలోని అచ్చంపేట, నాగర్​కర్నూల్​సెగ్మెంట్లలో కార్యకర్తల సమావేశాలను ఆదివారం పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశాలకు సిట్టింగ్ ఎంపీ రాములును ఆహ్వానించలేదని తెలిసింది. దీనిని అవమానంగా భావించిన ఎంపీ త్వరలోనే బీఆర్ఎస్​కు రాజీనామా చేయనున్నట్లు స్పష్టం చేశారు.

పొమ్మనలేక పొగ.. 

అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ నాగర్​కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజుకు, ఎంపీ రాములుకు మధ్య కొన్నాళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటున్నది. ఎంపీ కొడుకు భరత్ ప్రసాద్​ను జడ్పీ చైర్మన్ కాకుండా గువ్వల రెండుసార్లు అడ్డుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. నియోజకవర్గంలో ఎంపీ, ఆయన కొడుకు ఫ్లెక్సీలను కూడా పెట్టకుండా అడ్డుకోవడం అప్పట్లో వివాదాస్పదమైంది. వీరి మధ్య సయోధ్య కుదర్చాల్సిన బీఆర్ఎస్ హైకమాండ్ విషయాన్ని లైట్​గా తీసుకుంది. దీంతో విభేదాలు తీవ్రమయ్యాయి.

 ఎన్నికల ముందు అచ్చంపేటలో జరిగిన కేసీఆర్ బహిరంగ సభకు ఎంపీని హాజరవకుండా గువ్వల అడ్డుపడ్డారు. ఈ కోపంతో రాములు అనుచరులంతా అచ్చంపేట ఎన్నికల్లో గువ్వలకు మద్దతుగా పనిచేసే ప్రసక్తే లేదంటూ కాంగ్రెస్​లో చేరారు. రాములు వల్లే తాను ఓడిపోయానని బీఆర్ఎస్ హైకమాండ్​కు గువ్వల ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గువ్వల కూడా ఎంపీ టికెట్​పై కన్నేశారు. కొద్దిరోజులుగా తానే ఎంపీ అభ్యర్థినం టూ ప్రచారం చేసుకుంటున్నారు. 

అవసరమైన చోట అసెంబ్లీ ఇన్​చార్జిలను మారుస్తానని సంకేతాలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ హైకమాండ్​కూడా గువ్వల వైపే మొగ్గుచూపడం, తాజాగా జరిగిన మీటింగులకు సిట్టింగ్ ఎంపీని ఆహ్వానించకపోవడంతో రాములు పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.