హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ హయాంలో కబ్జాలు, అక్రమ నిర్మాణాలు వంటివి మాత్రమే జరుగుతున్నాయని.. ఎక్కడా అభివృద్ధి జరగడం లేదని మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నాయకులు కబ్జాలు, అక్రమ నిర్మాణాలు చేపట్టడంలో పోటీ పడుతున్నారని విమర్శించారు. ఐదేళ్ల ముందు వరకు గంజికి కూడా గతిలేని గులాబీ నేతలు ఇప్పుడు బెంజ్ కార్లలో తిరుగుతున్నారని ఆరోపించారు. మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్ అధ్యక్షతన ఆదివారం గండిమైసమ్మలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో మున్సిపల్ ఎన్నికలసన్నాహక సభ జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఐదేళ్ల టీఆర్ఎస్ పాలనలో జరిగిందేమీ లేదన్నారు. దీనిపై తమ స్థానిక నాయకత్వంతో టీఆర్ఎస్ నేతలు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మున్సిపల్ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ ని గెలిపిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ప్రజలను హెచ్చరించారు. కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మెజారిటీ స్థానాలు గెల్చుకుంటామన్నారు.
