
కోస్గి, వెలుగు: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వముంది.. కొడంగల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే అంతా అభివృద్ధే అన్నారప్పుడు.. 13 నెలలైంది.. నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ అని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి ప్రశ్నించారు. కోస్గి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. మహబూనగర్- చించోలి డబుల్ రోడ్డు వేయించింది తానేనని, ఆ రోడ్డు ఇప్పుడు గుంతలమయంగా మారినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన కేటీఆర్ సంవత్సరంలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. కుట్రపూరిత రాజకీయాలతో టీఆర్ఎస్ తనను ఎమ్మెల్యేగా ఓడిస్తే.. మల్కాజ్గిరి ప్రజలు ఆదరించి ఢిల్లీకి పంపారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించాలని కోరారు