కేసీఆర్ అందరినీ మోసం చేసిండు

కేసీఆర్ అందరినీ మోసం చేసిండు

ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకోలేదు

మైనార్టీ బిల్లుతో ఎస్టీల బిల్లును ముడి పెట్టి దగా చేసిండు

సీఎంపై పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్​రెడ్డి ఫైర్

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలను సీఎం కేసీఆర్ మోసం చేశారని పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మైనార్టీ బిల్లుతో ఎస్టీల రిజర్వేషన్ బిల్లుకు ముడిపెట్టి గిరిజన బిడ్డలను దగా చేసిండని విమర్శించారు. మంగళవారం ఢిల్లీ జంతర్ మంతర్ లో ‘గిరిజన శక్తి’పేరుతో యూనివర్సిటీల గిరిజన స్టూడెంట్లు ఆందోళన చేశారు. ఈ ధర్నాకు సంఘీభావం తెలిపిన ఉత్తమ్.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పెద్ద పెద్ద మాటలు చెప్పే కేసీఆర్, ఐదున్నరేండ్లు గడుస్తున్నా ఎస్టీలకిచ్చిన 12 శాతం రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకోలేదన్నారు. రిజర్వేషన్ల పెంపుపై బిల్లును ఢిల్లీ పంపించాల్సిన అవసరం లేదని, ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎగ్జిక్యుటివ్ ఆర్డర్ ఇచ్చి రిజర్వేషన్లు పెంచారని గుర్తు చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా తాము మద్దతు తెలుపుతున్నా కేసీఆర్ ఎందుకు రిజర్వేషన్లు పెంచడం లేదని ప్రశ్నించారు. 12 శాతం కోటా కల్పిస్తామన్న కేసీఆర్, ఆ మాటను విస్మరించి ఎస్టీల్లో విభేదాలను రెచ్చగొడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. రాష్ట్రం వస్తే ఎస్టీల జీవితాలు బాగుపడతాయని భావించామని, కేసీఆర్ కుటుంబం తప్ప గిరిజన బిడ్డల బతుకు మారలేదన్నారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే, మైనార్టీ బిల్లు నుంచి ఎస్టీల బిల్లును వేరు చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. గిరిజన కోటా పెంపు అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తుతానని ఎంపీ మాలోతు కవిత స్పష్టం చేశారు. రిజర్వేషన్లు పెంచకపోవడం వల్ల విద్యా, ఉద్యోగ అవకాశాల్లో గిరిజన బిడ్డలు నష్టపోతున్నారన్నారు.