రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాలపై తిరగబడదాం : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాలపై తిరగబడదాం : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
  •     దీక్షా దివస్ సన్నాహాక సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర 

ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా తిరుగబడుదామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలా వైఫల్యం చెందిందన్నారు. 

కాంగ్రెస్ అసమర్థ పాలన పట్ల విసిగి వేసారిన ప్రజల తిరుగుబాటు ఖమ్మం జిల్లా నుంచే మొదలవుతుందని చెప్పారు. నవంబర్​ 29న దీక్షా దివస్​ నిర్వహణపై ఖమ్మం తెలంగాణ భవన్​ లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన  మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ నాయకులు చేసిన మోసాన్ని ప్రజలకు వివరిద్దామన్నారు. 

కాంగ్రెస్ నాయకుల బెదిరింపులు, వేధింపులు, పెట్టే కేసులకు ఏ మాత్రం భయపడకుండా అందరం మరింత సంఘటితమై ధైర్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. మెజార్టీ స్థానిక సంస్థలను గెల్చుకొని సత్తా చాటుదామన్నారు. 

బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి, పార్టీ నాయకుడు, మాజీ డీసీసీబీ చైర్మన్​ కూరాకుల నాగభూషణం, మాజీ జడ్పీ చైర్మన్​ లింగాల కమల్ రాజ్, నేతలు ఉప్పల వెంకటరమణ, పగడాల నాగరాజు, సుబ్బారావు, పగడాల నరేందర్, బెల్లం వేణు, ఖమర్, తిరుమల్, తాజొద్దీన్ పాల్గొన్నారు.