ఖమ్మంలో సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి : వద్దిరాజు రవిచంద్ర

ఖమ్మంలో సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి : వద్దిరాజు రవిచంద్ర
  •     రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి
  •     రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు ఎంపీ వద్దిరాజు వినతి

ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో పలు సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించాలని, కోవిడ్ సమయంలో జిల్లాలో రద్దు చేసిన పలు ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కోరారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో ఆయన రైల్వే మంత్రిని కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన రైల్వే సమస్యలపై వినతి పత్రం అందజేశారు. 

బిహార్, ఢిల్లీ, రాజస్థాన్ వైపు వెళ్లే ప్రయాణికులకు సౌలభ్యంగా గయా మాస్, స్వర్ణ జయంతి, జైపూర్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఖమ్మంలో నిలపాలని విజ్ఞప్తి చేశారు. ఇరుముడి ధరించి శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఖమ్మంలో కేరళ ఎక్స్ ప్రెస్ కు హాల్టింగ్ కల్పించాలని కోరారు. 

గార్ల రైల్వే స్టేషన్​లో శాతవాహన, ఇంటర్ సిటీ రైళ్లను ఆపడంతో పాటు స్టేషన్ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కోవిడ్ వ్యాప్తి సమయంలో ఉమ్మడి జిల్లాలో రద్దు చేసిన కాజీపేట‌‌‌విజయవాడ, డోర్నకల్‌ ‌భద్రాచలం, కాజీపేట‌‌మణుగూరు, కొల్లాపూర్ ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని, కాకతీయ ప్యాసింజర్ రైలుకు తడికలపూడి, చీమలపాడు, బేతంపూడి స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం కల్పించాలని వినతి పత్రంలో కోరారు. 

కాజీపేట‌‌విజయవాడ ప్యాసింజర్ రైలు తిరుపతి వరకు పొడిగించి తిరుమల వెళ్లే భక్తుల ఇబ్బందులు తొలగించాలని, భద్రాచలం రోడ్ నుంచి సికింద్రాబాద్ కు ఉదయం పూట మరో రైలును మంజూరు చేయాలని ఎంపీ రవిచంద్ర కోరారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.