విజయసాయిరెడ్డి ట్వీట్ పై కాంగ్రెస్ మండిపాటు

విజయసాయిరెడ్డి ట్వీట్ పై కాంగ్రెస్ మండిపాటు
  • ఖాట్మండులో నైట్ పార్టీలో పాల్గొన్న రాహుల్
  • రాహుల్ పక్కనున్న మహిళ చైనా రాయబారి హౌ యాంక్వీ : విజయసాయి 
  • చైనా హనీ ట్రాప్ అంశాన్ని ప్రస్తావించిన వైసీపీ ఎంపీ  

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేపాల్ రాజధాని ఖాట్మండులోని ఓ నైట్ క్లబ్ లో పార్టీ చేసుకుంటూ కనిపించడం రాజకీయ దుమారం రేపుతోంది. దీనిని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ కష్టాల్లో ఉన్న సమయంలో రాహుల్ నైట్ క్లబ్ లకు వెళ్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ టూర్ పైనా కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. క్లబ్ లో రాహుల్ పక్కన ఓ మహిళ ఉండడం మరింతగా విమర్శలకు దారి తీసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు కాంగ్రెస్ వర్గాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేశారు.

నేపాల్ నైట్ క్లబ్ లో రాహుల్ పక్కన ఉంది ఎవరో తెలుసా..? అంటూ ట్వీట్ చేశారు. నేపాల్ లో చైనా దౌత్యవేత్తగా పని చేస్తున్న హౌ యాంక్వీ అని చెబుతూ.. గతంలో ఆమె చేసిన హానీ ట్రాప్ గుర్తుకు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రధాని మోడీ యూరప్ పర్యటనపై కాంగ్రెస్ అవసరం లేని విమర్శలు చేసిందని చెబుతూ.. ఇప్పుడు కాంగ్రెస్ నేత వివాదంలో చిక్కుకున్నారంటూ ట్వీట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాగూర్ స్పందించారు. ఈ వివాదం ప్రారంభమైన వెంటనే ముందుగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ ఫొటో ఒకటి ట్వీట్ చేస్తూ....ఎవరో తెలుసా అంటూ ప్రశ్నించారు. ఇక, విజయ సాయిరెడ్డి ట్వీట్ కు కూడా సమాధానం ఇచ్చారు.

వాస్తవం ఏంటో చూడాలని సూచిస్తూనే... అవినీతి సాయిరెడ్డి ఇబ్బంది ఏంటో తనకు తెలుసని...జగన్ రెడ్డి పైన కేసుల కారణంగానే సాహిబ్ (ప్రధాని) ని సంతోష పర్చేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ నేపాల్ రాయబారి కుమార్తె వివాహానికి హాజరయ్యారని..ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ వివాదం కాంగ్రెస్ వివరణతో ముగుస్తుందా..?లేక కొనసాగుతుందా..? అనేది చూడాల్సి ఉంది.