ఫ్లైట్ నిలిపేయడంలో ఆలస్యం చేస్తే చాలా ప్రమాదం

ఫ్లైట్ నిలిపేయడంలో ఆలస్యం చేస్తే చాలా ప్రమాదం

దక్షిణాఫ్రికాలో గుర్తించి ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ మొత్తాన్ని వణికిస్తోంది. ఈ కరోనా కొత్త వేరియంట్‌ రోగ నిరోధక శక్తిని సైతం ఛేదించి మనిషికి సోకే ప్రమాదం ఉందని, వ్యాక్సిన్లు కూడా అడ్డుకోలేకపోవచ్చని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్ వ్యాప్తి జరగకుండా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలతో సిద్ధమైంది. అయితే ఒమిక్రాన్‌ అడ్డుకునేందుకు ముందుగా చేయాల్సింది అంతర్జాతీయ విమాన రాకపోకలను నిలిపేయడమేనంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ లేఖను కేజ్రీవాల్‌ తన ట్విట్టర్‌‌ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దయచేసి అత్యవసరంగా విదేశాల నుంచి వచ్చే విమాన సర్వీసులను బంద్ చేయాలని మోడీని కోరారు. ఇప్పటికే పలు దేశాలు ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి ఫ్లైట్ సర్వీసులను నిలిపేశాయని గర్తు చేశారు. మరీ మీరెందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ప్రశ్నించారాయన.

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనూ ఫ్లైట్ సర్వీసులను అపేసే విషయంలో ఆలస్యం చేశామని కేజ్రీవాల్ అన్నారు. చాలా వరకూ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఢిల్లీలోనే ల్యాండ్ అవుతాయని, దీని వల్ల ఢిల్లీ సిటీనే తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఈ సమయంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను అడ్డుకునేందుకు దయచేసి తక్షణం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఆపరేషన్స్ నిలిపేయండి.. పీఎం సాబ్‌ అంటూ కేజ్రీవాల్ ఆ లేఖలో కోరారు. ఫ్లైట్‌ నిలిపేసే విషయంలో ఆలస్యం చేస్తే పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారుతాయని హెచ్చరించారు. ఈ లెటర్‌‌తో పాటు సౌతాఫ్రికా నుంచి చండీగఢ్ వచ్చిన 39 ఏండ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఎఎన్‌ఐలో వచ్చి న్యూస్‌ను కూడా ఆయన పోస్ట్ చేశారు.