
హైదరాబాద్, వెలుగు: ఎన్నికలకు ముందు బదిలీ చేసిన తహసీల్దార్లను తిరిగి పాత జిల్లాలకు ట్రాన్స్ ఫర్ చేయాలనే డిమాండ్ తో సోమవారం నుంచి ఆందోళనలు చేపట్టాలని రాష్ట్ర తహసీల్దార్ల సంఘం(టీజీటీఏ) నిర్ణయించింది. హైదరాబాద్ నాంపల్లిలోని సీపీఎఎల్ఏ ఆవరణలోని టీజీటీఏ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశంలో కార్యాచరణ ప్రకటించింది. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సీఎస్, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సీసీఎల్‌ఏలను కలిసి కలిసి నోటీసు ఇవ్వనున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నారు.
మంగళవారం నుంచి ఈ నెల 12 వరకు వర్క్ టు రూల్(ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు) పాటించి నిరసన తెలుపుతారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్లు సామూహిక సెలవు (మాస్ క్యాజువల్ లీవ్) పెట్టాలని నిర్ణయించారు. సమావేశంలో తెలంగాణ తహసీల్దార్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.గౌతమ్‌కుమార్, టీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట భాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఫూల్ సింగ్ చౌహాన్, రాష్ట్ర కార్యదర్శులు రాజేశ్వర్, ముంతాజ్, వెంకట్‌రెడ్డి, అన్వర్, వివిధ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణారెడ్డి, శ్రీనివాస్ కుమార్, మల్లేశం, శ్రీనివాస్, సుభాశ్ చందర్, జయంత్, మంగీలాల్, అమీన్ సింగ్, సలహాదారులు సలీముద్దిన్ పాల్గొన్నారు.