హైదరాబాద్, వెలుగు:కాంగ్రెస్ దళిత నేత భట్టి విక్రమార్క కేసీఆర్ తో కుమ్మక్కై ఆయన భజన చేస్తున్నారని.. భట్టి లాంటి అమ్ముడుపోయే నాయకుల వల్ల దళిత సమాజం సిగ్గుపడుతోందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. టీఆర్ఎస్ లో ఉన్న దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు తమ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. శుక్రవారం ఆయన సికింద్రాబాద్ పార్సీగుట్టలోని ఎమ్మార్పీఎస్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ.. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసును కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని, ఈ విషయంలో సీఎంకు డీజీపీ సహకరిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల చిత్రహింసల వల్లే మరియమ్మ చనిపోయిందని డీజీపీకి క్లారిటీ ఉందని, అయినా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. మరియమ్మ కొడుకును కూడా చర్మం ఉడిపోయేలా పోలీసులు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులపై మర్డర్ కేసు నమోదు చేయనప్పుడు ఎస్సై, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈనెల 5న డీజీపీని కలుస్తానని, ఆ లోపు 48 గంటల్లో సరైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రియాంక రెడ్డి(దిశ), కల్నల్ సంతోష్ చనిపోయిన సందర్భాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎక్స్ గ్రేషియా ఇచ్చారని, కానీ దళిత మహిళ మరియమ్మ చనిపోతే సాంఘిక సంక్షేమ శాఖ నుంచి ఎక్స్ గ్రేషియా ఇవ్వడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ డ్రామాలు పసిగట్టలేమని అనుకోవద్దని, ఆయనకు సరెండర్ అయ్యేవాళ్లు అవుతారని, తాము ప్రజల తరఫున కొట్లాడుతామని మందకృష్ణ మాదిగ అన్నారు. సమాచారం, ఆధారాలపై పనిచేయాల్సిన పోలీసులు.. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. నేరేళ్ల దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై ఇప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దళిత సాధికారత పేరుతో సీఎం మరో డ్రామా ఆడుతున్నాడని, కేసీఆర్, టీఆర్ఎస్ ఉన్నన్ని రోజులు తెలంగాణలో దళితులకు హక్కులుండవని పేర్కొన్నారు. రాష్ట్రంలో సైద్ధాంతిక పోరాటం చేయడానికి కాంగ్రెస్, బీజేపీ సిద్ధంగా లేవని, వామపక్షాలు పోరాటాన్ని మర్చిపోయాయని ఆరోపించారు. దొరల తెలంగాణను ఓడించి, సామాజిక తెలంగాణ తేవడమే లక్ష్యంగా త్వరలోనే 119 నియోజకవర్గాల్లో యాత్ర చేపడుతామని వెల్లడించారు.
