దర్శకుడు బలగం వేణు తన రెండో సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ‘బలగం’ సినిమాతో గొప్ప గుర్తింపు పొందిన వేణు, ఇప్పుడు ‘ఎల్లమ్మ’ అనే గ్రామీణ నేపథ్యంలో సాగే కథను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను తన మొదటి చిత్రాన్ని మించేలా తీర్చిదిద్దేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలోనే ‘ఎల్లమ్మ’ గ్లింప్స్‌ను విడుదల చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు. ముఖ్యంగా ఈ చిత్రంలో దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతుండటం పెద్ద సర్‌ప్రైజ్‌గా మారింది. సంగీత దర్శకుడిగా ఇప్పటికే స్టార్‌డమ్ సంపాదించిన దేవిశ్రీ ప్రసాద్, ఈ చిత్రంతో నటుడిగానూ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు.
‘ఎల్లమ్మ’ కోసం సీత..
సినిమా టైటిల్‌కు ముఖ్యమైన ‘ఎల్లమ్మ’ పాత్రలో ఎవరు నటిస్తారన్నది ఇంకా సస్పెన్స్‌గా ఉంది. మొదటగా సాయి పల్లవి, తరువాత కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి. వీరిలో ఎవరో ఒకరు ఫైనల్ అనుకున్నారంతా. కానీ, ఏ క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే పేర్లు కూడా మౌత్ టాక్తో ప్రచారంలోకి వచ్చాయి. కానీ, వీరిలో ఎవ్వరు కన్ఫామ్ కాలేదు. అయితే, ఇపుడు ఈ లిస్టులోకి మరో కొత్త హీరోయిన్ చేరింది.
ఎవ్వరూ ఊహించని విధంగా సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ని ఫిక్స్ చేసాడట వేణు. ‘ఎల్లమ్మ’ పాత్ర కోసం మృణాల్ను ఫైనల్ చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఆమె ఎల్లమ్మ సెట్స్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృణాల్.. సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇందులో సీత పాత్రలో నటించి ఒదిగిపోయింది.
ఓ వైపు సీతగా, మరోవైపు ప్రిన్సెస్ నూర్జహాన్‌గా తన నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ఎల్లమ్మ కోసం సీతను తీసుకొచ్చి హిట్ కొట్టేయాలని ఫిక్స్ అయ్యాడట వేణు. అలా మొత్తానికి, ‘ఎల్లమ్మ’ పాత్ర కోసం వేణు ఒక బలమైన ఎంపిక వైపు వెళ్లినట్టే కనిపిస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ : సూర్య వీరభద్రుడు మూవీకి U/A సర్టిఫికేట్..
డప్పు కళాకారుడి పాత్రలో 'పర్షి'
ఈ చిత్రంలో దేవిశ్రీప్రసాద్ ‘పర్షి’ అనే డప్పు కళాకారుడి పాత్రలో కనిపిస్తున్నారు. విడుదలైన గ్లింప్స్‌లో డిఎస్పీ మాస్ లుక్, ఆయన మేకోవర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో డప్పు వాయిస్తూ ఆయన పండించిన ఎమోషన్స్ హైలైట్‌గా నిలిచాయి. తన సినిమాకు తనే సంగీతాన్ని సమకూర్చుకోవడం మరో విశేషం.
నిజానికి ఈ కథ ముందుగా నేచురల్ స్టార్ నాని, యువ హీరో నితిన్ దగ్గరకు వెళ్ళింది. కొన్ని కారణాల వల్ల వారు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో, వేణు యెల్దండి ఈ పాత్రకు దేవిశ్రీప్రసాద్ అయితేనే న్యాయం చేయగలరని భావించారు. ఒక సంగీత కళాకారుడి కథ కావడం, డిఎస్పీకి ఉన్న క్రేజ్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయని భావిస్తున్నారు.
భారీ నిర్మాణ విలువలు
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టి-సిరీస్ సంస్థ ఈ సినిమా మ్యూజికల్ రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుంది. ‘బలగం’ తర్వాత వేణు యెల్దండి తీస్తున్న సినిమా కావడంతో పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పల్లెటూరి మట్టి వాసనతో, డప్పు చప్పుళ్లతో ఈ ‘ఎల్లమ్మ’ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి!
