ఒకే వేదికపై దిగ్గజ క్రికెటర్లు..లాంగ్ లీవ్ లెజెండ్స్ అంటూ కామెంట్

ఒకే వేదికపై  దిగ్గజ క్రికెటర్లు..లాంగ్ లీవ్ లెజెండ్స్ అంటూ కామెంట్

వచ్చే నెలలో ఐపీఎల్ 2023 ప్రారంభం కానున్న నేపథ్యంలో..చెన్నై సూపర్ కింగ్స్ ఎంఎస్ ధోని, క్రిస్ గేల్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓ వేదికపై ఈ ఇద్దరు దిగ్గజాలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి దిగిన ఓ ఫోటోను గేల్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోకు లాంగ్ లీవ్ ది లెజెండ్స్ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది. 

ఎందుకు కలిశారంటే...

ఓ ప్రమోషనల్‌ ఈవెంట్లో భాగంగా ధోని, గేల్ కలుసుకున్నట్లు తెలుస్తోంది.  ఐపీఎల్‌ 2023 కోసం జియో సినిమా రూపొందిస్తున్న వీడియోలో వీరిద్దరూ నటిస్తున్నారని..అందుకే కలిశారని సమాచారం. మరోవైపు జియో సినిమా క్రిస్ గేల్ను క్రికెట్‌ విశ్లేషకుడిగా ఎంపిక చేసుకుంది. ఐపీఎల్‌ మొదలుకు ముందు లైవ్‌స్ట్రీమింగ్‌, టెలికాస్టింగ్‌ భాగస్వాములు అభిమానులను ఆకట్టుకొనే విధంగా ప్రమోషనల్‌ వీడియోలను తయారు చేస్తాయి. గతేడాది వరకు లైవ్‌ స్ట్రీమింగ్‌, టెలికాస్టింగ్‌  బాధ్యతలు స్టార్ స్పోర్ట్స్ వద్దే ఉండేవి. అయితే  ఈ ఏడాది  లైవ్‌ స్ట్రీమింగ్‌ హక్కుల్ని జియో, టెలికాస్టింగ్‌ హక్కుల్ని స్టార్‌ దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ ఈవెంట్ లో ఈ దిగ్గజాలు నటిస్తున్నారు. 

ధోనికిదే చివరి ఐపీఎల్..?

ఎంఎస్ ధోని 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ధోని సారథ్యంలోని చెన్నై.. నాలుగు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. అయితే ఇప్పటికే ధోని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకగా..గతేడాది ఐపీఎల్కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా భావించారు. అయితే సొంత ప్రేక్షకుల మధ్య ఐపీఎల్ నుంచి వైదొలగాలని తన మనసులోని కోరినక ను ధోని బయటపెట్టాడు. ఈ నేపథ్యంలో  ఐపీఎల్ 2023లో వీడ్కోలు పలికే అవకాశం ఉంది.