ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నిన ఎంఎస్ ధోని

ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నిన ఎంఎస్ ధోని

క్రికెటర్గా, ఆర్మీ మేజర్గా, ఇటీవలే పోలీస్ ఆఫీసర్గా అవతారం ఎత్తిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని..తాజాగా సరికొత్తగా ఫ్యాన్స్ను పలుకరించాడు. రైతుగా మారి పొలం దున్నుతున్నాడు. ట్రాక్టర్ నడిపిస్తూ దుక్కిదున్నుతున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్లో ధోని షేర్ చేశాడు.  కొత్తది నేర్చుకోవడం బాగుందన్నాడు. అయితే పని పూర్తి చేయడానికి మాత్రం చాలా సమయం పట్టిందని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ధోని పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. 

ఎంఎస్ ధోనికి గ్రామీణ వాతావరణం, వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అందుకే సమయం దొరికినప్పుడల్లా..రైతుగా మారుతాడు. ఇప్పటికే ధోని కడక్ నాథ్ కోళ్లను కూడా పెంచుతున్నాడు. తాజాగా తన వ్యవసాయ క్షేత్రంలో రైతుగా మారి పొలం దున్నుతున్నాడు. 

2020లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోని..ఆ తర్వాత ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. గతేడాది సీఎస్కే కెప్టెన్సీ వదులుకున్నాడు. అయితే 2022 సీజన్లో చెన్నై జట్టు పేలవ ప్రదర్శన కారణంగా జట్టు మేనేజ్మెంట్ ధోనికే పగ్గాలు తిరిగి అప్పగించింది. ఇక 2023 ఐపీఎల్ కోసం ధోని సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. మొత్తం ధోని ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లు కలిపి 538 మ్యాచులు ఆడాడు. 44.96 సగటుతో 21,834 పరుగులు సాధించాడు. ఇందులో 16 సెంచరీలు, 108 అర్థసెంచరీలు చేశాడు.