
ఐపీఎల్ టోర్నీ ముగుస్తుందంటే మహేంద్ర సింగ్ రిటైర్మెంట్ గురుంచి వార్తలు రావడం సహజమే. గత రెండేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. మహేంద్రుడు సైతం తన వీడ్కోలు గురించి ఎటూ తేల్చక కాలయాపన చేస్తున్నాడు. ప్రస్తుతం ధోని వయసు.. 42 ఏళ్లు. మరో నెల గడిస్తే.. 43. ఈ క్రమంలో అతను మరో సీజన్ కొనసాగేది అనుమానమనే ఊహాగానాలు అందరిలోనూ ఉన్నాయి. కొంతమందైతే ధోనీ ఐపీఎల్ కెరీర్ లో తన చివరి మ్యాచ్ ఆడేశాడని చివరి లీగ్ మ్యాచ్ కు ముందు ఫిక్స్ అయిపోయారు. ఐపీఎల్ 2025 లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం (మే 25) గుజరాత్ టైటాన్స్ పై తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడేసింది.
మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ విషయంపై స్పందించాడు. అయితే ఐపీఎల్ కు గుడ్ బై చెబుతాడా లేదా అనే విషయంలో సస్పెన్స్ కు తెరదించలేదు. " నేను క్రికెట్ ఆడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి నాకు నాలుగు లేదా ఐదు నెలల సమయం ఉంది. ఇది ప్రొఫెషనల్ క్రికెట్. మీరు మీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. మీకు ఎంత ఆసక్తి ఉందనేది ముఖ్యం. రిటైర్మెంట్ సంగతి పెట్టి ముందుగా నేను రాంచీకి తిరిగి వెళ్ళాలి. నేను ఐపీఎల్ ఆడతానని చెప్పట్లేదు. అలాగని ఆడట్లేదని చెప్పట్లేదు. నాకు ఇంకా చాలా సమయం ఉంది.
"ఈ రోజు మా ప్రదర్శన బాగుంది. ఇది హౌస్‌ఫుల్ ప్రదర్శన అని నేను చెప్పను. ఇది మాకు మంచి సీజన్ కాదు. ఈ సీజన్ లో క్యాచ్‌లు సరిగా పట్టలేదు. కానీ ఈరోజు క్యాచింగ్ బాగుంది. నా రిటైర్మెంట్ నిర్ణయంపై ఇంకా చాలా సమయం ఉంది. అప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోను. ముందుగా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలి. క్రికెటర్లు తమ ప్రదర్శన బట్టి రిటైర్మెంట్ ఇవ్వాల్సి వస్తే కొంతమంది 22 ఏళ్లకే రిటైరవ్వాలి". అని ధోనీ మ్యాచ్ తర్వాత చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో ధోనీ బ్యాటింగ్ కు రాలేదు. తన చివరి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 16 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సీజన్ లీగ్ దశలో తాము ఆడుతున్న చివరి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై 83 పరుగుల భారీ విజయాన్ని సాధించారు. వరుస ఓటములతో ఢీలా పడిన సూపర్ కింగ్స్ ఓదార్పు విజయంతో ఈ సీజన్ ను ముగించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ 147 పరుగులకే ఆలౌట్ అయింది.