ఎంఎస్క్యూ యాప్ ‘మాయాజాలం’!.. కస్టమర్లతో రూ.కోట్లల్లో పెట్టుబడి పెట్టించి యాప్ను బ్లాక్ చేసిన నిర్వాహకులు

ఎంఎస్క్యూ యాప్  ‘మాయాజాలం’!..  కస్టమర్లతో రూ.కోట్లల్లో పెట్టుబడి పెట్టించి యాప్ను బ్లాక్ చేసిన నిర్వాహకులు
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పెద్ద సంఖ్యలో బాధితులు 
  • పండుగ వేళ పైసలు పోయి తలలు పట్టుకున్న పలు కుటుంబాలు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  ఎంఎస్​క్యూ ఆన్​లైన్​ యాప్​ మాయాజాలంలో పడి భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని వందలాది మంది రూ.కోట్లలో నష్టపోయారు. ‘ఎంఎస్​క్యూ ఆన్​లైన్​ యాప్​లో పెట్టుబడి పెట్టి పదింతలు లాభం పొందండి’ అంటూ కొందరు వ్యక్తులు ఇల్లెందు, కొత్తగూడెం ప్రాంతాల్లో దావత్​లు ఇచ్చి ప్రజలను నమ్మించారు. ఎంఎస్​క్యూ ఆన్​ లైన్​ యాప్​లో రూ. 17,500 పెట్టుబడి పెట్టాలని సూచించారు. సెల్​కు రోజుకు 20యాడ్స్​ వస్తాయని, ఒక్కో యాడ్​ 15 సెకన్ల నిడివి ఉంటుంది. ఈ యాడ్స్​ను చూసి, లైక్​ కొట్టాలని చెప్పారు.  రూ. 17,500 పెట్టుబడి పెట్టినందుకు ఏడాది పాటు రోజుకు రూ. 500 మీ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని నమ్మకం కలిగేలా చెప్పారు. 

మరింత నమ్మకం కలిగించేలా వారి ఖాతాల్లో జమ అయిన మొత్తాలను చూపించారు. దానికి తోడు కొత్తగా మరొకరిని చేర్పిస్తే రూ. 2,600  అదనంగా ఖాతాల్లో జమ అవుతాయని వల విసిరారు. ప్రతీ శుక్రవారం డబ్బులను డ్రా చేసుకోవచ్చని చెప్పారు. రూ. 17,500లతో పాటు రూ. 56వేలు, రూ. 1.45లక్షలు ఇలా పెట్టుబడుల్లో రకాలున్నాయి. ఒక్కో రకం పెట్టుబడికి రోజుకు జమ అయ్యే డబ్బు పెరుగుతుందని ఆశపెట్టారు.

వందల సంఖ్యలో జాయిన్​ అయిన్రు..

ఎంఎస్​క్యూ యాప్​లో కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాలతో పాటు జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో జాయిన్​ అయ్యారు. జాయిన్​ చేసిన వారిలో ఎక్కువ మంది వ్యాపారులు, టీచర్లు, ఆర్​ఎంపీలు, రిపోర్టర్లతో పాటు విద్యావంతులు ఉన్నారు. ఎక్కడ ఉంటారో తెలియని లిమ్డా అనే మహిళ ఈ యాప్​లో సూత్రధారిగా కాగా, చాలా మందిని చేర్చుకొని యాప్​ లావాదేవీలు నిర్వహించారు. ఇల్లెందుకు చెందిన ఓ వ్యక్తి తన కింద దాదాపు 150మందిని జాయిన్​ చేయగా, కొత్తగూడెంకు చెందిన మరో వ్యక్తి 120 మందిని, టేకులపల్లికి చెందిన ఒకతను 45మందిని మెంబర్లుగా జాయిన్​ చేశారు. ఎంఎస్​క్యూ యాప్​లో జాయిన్​ అయిన మొదట్లో రోజుకు రూ. 500 చొప్పున డబ్బులు జమ అవుతుండడంతో వీరు నమ్మారు. తమ బంధువులను, స్నేహితులను జాయిన్​ చేశారు. 

నిలిచిన లావాదేవీలు...తలలు పట్టుకున్న బాధితులు..

ఎంఎస్​క్యూ యాప్​ గత మూడు వారాలుగా తమ లావాదేవీ క్రమంగా తగ్గిస్తూ గత శుక్రవారం పూర్తిగా నిలిపి వేసింది. యాప్​ క్లోజ్​ అయిందని తెలుసుకున్న వారు తాము మోసపోయామని గమనించి ఆందోళన చెందుతున్నారు. ఇల్లెందు పట్టణం ఆర్​అండ్​ఆర్​ కాలనీకి చెందిన ఓ వ్యక్తి తాను జాయిన్​ అయిన తర్వాత తనకు రూ. 20వేల వరకు రావడంతో తన కుటుంబంలోని వారితో పాటు మరికొందరితో  రూ. 17,500 పెట్టుబడి పెట్టించాడు.

 వారికి ఒక్క పైసా రాకుండానే యాప్​ క్లోజ్​కావడంతో తలలు పట్టుకున్నారు. ఇల్లెందు పట్టణంలోని జేకే కాలనీకి చెందిన ఓ వ్యక్తి 22మందిని జాయిన్​ చేశారు. ఒకరిద్దరికి మాత్రమే కొంత మొత్తం వారి ఖాతాల్లో జమ అయ్యాయి. మిగిలిన వారికి డబ్బులు జమ కాకపోవడంతో లబోదిబోమంటున్నారు. కొత్తగూడెంకు చెందిన ఓ వ్యక్తి తనకు రూ.1.80లక్షలు రావడంతో ఆ డబ్బులతో పాటు మరో రూ. 2లక్షల వరకు పెట్టుబడి పెట్టి మోసపోయాడు. కాగా, వీరంతా పోలీసులను ఆశ్రయించనున్నారు. 

ఆన్​లైన్ యాప్ ల మాయలో పడి మోసపోవద్దు

ఆన్ లైన్ యాప్ లో మాయలో పడి మోసపోవద్దు. కొంతమంది ఏదో ఒక యాప్, గ్రూపు క్రియేట్ చేసి కొంత పెట్టుబడి పెడితే పదింతలు వస్తుందంటూ మోసం చేస్తున్నారు. సైబర్ నేరాల పట్ల పోలీస్ శాఖ నిరంతరం అవగాహన కల్పిస్తూనే ఉంది. చదువుకున్న వాళ్లే ఇటువంటి సైబర్ నేరాల బారిన పడుతున్నారు. ఇకపై అలర్ట్​గా ఉండాలి. ఇల్లెందు, కొత్తగూడెం ప్రాంతాల్లో ఎంఎస్ క్యూ యాప్ పేర జరిగిన మోసం విషయమై ఇప్పటివరకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు. విచారణ చేపడతాం.- బి. రోహిత్ రాజు, ఎస్పీ , భద్రాద్రి కొత్తగూడెం