భారత్ షిప్ పై దాడి.. సముద్రపు దొంగల పనేనా..

భారత్ షిప్ పై దాడి.. సముద్రపు దొంగల పనేనా..

అరేబియా సముద్రంలో డ్రోన్ దాడికి గురైన వాణిజ్య నౌక ఎంవీ కెమ్ ఫ్లూటో డిసెంబర్ 25న ముంబైకి చేరుకుంది. భారత నౌకాదళానికి చెందిన పేలుడు పదార్థాలపై విస్తృత విచారణ చేపట్టిన అధికారులు.. తాజాగా మరింత సమాచారం కోసం ఫోరెన్సిక్, సాంకేతిక విశ్లేషణ చేపట్టామని నౌకాదళాధికారులు తెలిపారు.

నౌకలో లభ్యమైన పేలుడు పదార్ధాలు, శకలాలను బట్టి ఇది ఖచ్చితంగా డ్రోన్ దాడేనని స్పష్టమవుతోందని అధికారులు తెలిపారు. అంతకుముందు డిసెంబర్ 24న పోర్ బందర్ కు 217నాటికల్ మైళ్ల దూరంలో ఈ నౌకపై దాడి జరిగింది. ఈ సమయంలో ఓడల 21 మంది ఇండియన్ స్టాఫ్ ఉన్నారని సమాచారం. ఘటనకు సంబంధించిన సమాచారమందుకున్న భారత నౌకాదళం, యుద్ధ నౌకలు ఆ ప్రాంతానికి చేరుకుని.. రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టాయి.

ఇటీవల సముద్రంలో సరుకు రవాణా పడవలపై దాడులు పెరిగాయి. ఆధునిక టెక్నాలజీతో సముద్రపు దొంగలు దాడులు చేస్తున్నారు. సరుకు రవాణా షిప్ లను ఆధీనంలోకి తీసుకుని.. ఆయా షిప్ కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేశారు. గతంలో సోమాలియా, ఇతర దేశాలకు చెందిన వారు ఇలాంటి దాడులు చేసేవారు. దీనిపై అమెరికా, యూకే, చైనా, రష్యా ఆధ్వర్యంలో భారీ ఆపరేషన్ ద్వారా వీరిని కట్టడి చేసింది. ఇటీవల మళ్లీ భారీ స్థాయిలో సముద్రపు దొంగలు దాడులకు తెగబడుతున్నారు.

ప్రస్తుతం పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్ని ఆర్థిక సంక్షోభం, తీవ్రవాదం క్రమంలో.. కొన్ని ఉగ్రవాద సంస్థలు సైతం సముద్రంలో సరుకు రవాణా షిప్ లపై దాడులకు తెగబడుతున్నాయి. విమానాలు, డ్రోన్లు, ఆధునిక తుపాకులతో విరుచుకుపడుతున్నాయి.  ఈక్రమంలోనే భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. INS యుద్ద నౌకలు, పీ 81 నౌకాదళ విమానాలతో పహారా చేపట్టాలని భావిస్తుంది. ఇందుకు సంబంధించి నేవీ, ఆర్మీలతో చర్చలు చేస్తోంది కేంద్రం.