గంజాయి అమ్మకాలపై పోలీసుల ఉక్కుపాదం.. మరో ఘటనలో ఇద్దరు అరెస్ట్

గంజాయి అమ్మకాలపై పోలీసుల ఉక్కుపాదం.. మరో ఘటనలో ఇద్దరు అరెస్ట్

న్యూఇయర్ సెలబ్రేషన్స్ వేళ గ్రేటర్ హైదరాబాద్ లోని పలు చోట్ల భారీగా గంజాయి పట్టుబడుతోంది. తాజాగా హైదరాబాద్ లో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్, మొఘల్ పుర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 5 కేజీల 900 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని.. సీజ్  చేశారు.

దక్షణ మండలం అదనపు డీసీపీ షేక్ జహంగీర్ తెలిపిన వివరాల ప్రకారం..  

మొఘల్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని మెజ్బాన్ హోటల్ వద్ద గంజాయి అమ్ముతున్నట్లు ముందుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్, మొఘల్ పుర పోలీసులు మెజ్బాన్ హోటల్ వద్దకు వెళ్లారు. అక్కడ జావీద్ అనే వ్యక్తి తన ఆటోలో గంజాయిని దాచి అమ్ముతుండగా గమనించారు పోలీసులు.

వెంటనే పోలీసులు ఆ ఆటోను తనిఖీ చేయగా.. గంజాయి (87 ప్యాకెట్లు) పట్టుబడింది. జావీద్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. తాను వినోద్ సింగ్ అనే వ్యక్తి వద్ద నుండి కొనుగోలు చేసి.. అమ్ముతున్నట్లు తెలిపాడు. జావీద్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వినోద్ సింగ్ వద్దకు వెళ్లి అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

వినోద్ సింగ్ వద్ద 242 ప్యాకెట్ల ఎండు గంజాయి, టేప్ చుట్టి ఉన్న మరో  రెండు బండల్లో ఉన్న 2 కేజీల 900 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితుల నుంచి మొత్తం 5 కేజీల 900 గ్రాముల గంజాయిను సీజ్ చేశారు పోలీసులు. 

ఆంధ్రప్రదేశ్ విశాఖలో శ్రీను అనే వ్యక్తి వద్ద నుండి గంజాయిని కొనుగోలు చేసి.. హైదరాబాద్ కు తీసుకువచ్చి.. జావీద్ లాంటి వ్యక్తులకు అమ్ముతున్నట్లు వినోద్ సింగ్ చెప్పాడని దక్షణ మండలం అదనపు డీసీపీ షేక్ జహంగీర్ తెలిపారు.